సంప్రదాయ విలువలు, అభివృద్ధిలో వచ్చిన మార్పులు ఉట్టిపడే విధంగా అయోధ్య పట్టణ ఆధునికీకరణ పనులు జరగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అయోధ్య అభివృద్ధి ప్రణాళికపై ఆయన సమీక్ష నిర్వహించారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అయోధ్య అభివృద్ధి ప్రాధికార సంస్ధ అధికారులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై ప్రధాని ఆరా తీశారు. అయోధ్య పట్టణ ఆధునికీకరణ, రైల్వే స్టేషన్, విమానాశ్రయ అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయల కల్పన పనులను సమీక్షించారు.
"అయోధ్య ఆధ్యాత్మిక పట్టణమే కాదు మహనీయమైన పట్టణం కూడా. భారతీయుల సంస్కృతి చైతన్యాన్ని అయోధ్య ప్రతిబింబిస్తుంది. భవిష్యత్తు అవసరాల దృష్టిలో పెట్టుకుని అయోధ్యలో మౌలిక వసతుల నిర్మాణం జరగాలి. భక్తులు, పర్యటకులు సహా అందరికీ ఉపయోగపడేలా ఉండాలి. తమ జీవిత కాలంలో ఒక్కసారైనా అయోధ్యను దర్శించాలని భవిష్యత్తు తరాలు భావించేలా ఈ పనులు జరగాలి.
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే లక్షణాన్ని శ్రీరాముడు అనుసరించాడని మోదీ పేర్కొన్నారు. ప్రజలంతా ఉత్సహంగా పాల్గొనేలా అయోధ్య అభివృద్ధి పనులు జరగాలని పేర్కొన్నారు. నైపుణ్యాలున్న యువత ఈ పనుల్లో పాలుపంచుకోవాలని కోరారు.
అయోధ్య ఆలయ పట్టణ అభివృద్ధిపై అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్ధ ఎల్ఈఏ అసోసియేట్స్-సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ రూపొందించిన ప్రణాళికను మోదీ పరిశీలించారు. దీనిపై రూపొందించిన వీడియోలను వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో భాగం కావడం వల్లే.. అభివృద్ధి పనులు క్షేత్ర స్థాయిలో వేగం పుంజుకున్నాయని రామమందిర ప్రధానార్చకులు తెలిపారు.
అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు సీఎం ఆదిత్యనాథ్ చెప్పారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం రూ.1,000 కోట్లు ప్రకటించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మరో రూ.250 కోట్లు అందనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ఖాతాల నిలిపివేతపై ట్విట్టర్‌ను వివరణ అడుగుతాం'