PM Modi Ayodhya Anushtan : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సమీపిస్తున్న వేళ ఆ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ ప్రాణ ప్రతిష్ఠకు ఇంకా 11 రోజులే మిగిలి ఉన్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశం ఇచ్చారు. శుక్రవారం నుంచి తాను ప్రత్యేక అనుష్ఠానాన్ని (దీక్ష) అనుసరిస్తానని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని ఆడియో సందేశం విడుదల చేశారు. దానిని తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో పోస్టు చేశారు. తర్వాత సామాజిక మాధ్యమం ఎక్స్‌లోనూ పోస్ట్ చేశారు.
ఈ మహోన్నత ఘట్టాన్ని కనులారా వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని మోదీ తెలిపారు. తాను గతంలో ఎప్పుడూ ఇంతటి ఉద్వేగానికి లోను కాలేదని, జీవితంలో మొదటిసారి అలాంటి అనుభూతులను అనుభవిస్తున్నానని మోదీ పోస్ట్ చేశారు. శ్రీరామ మూర్తి ప్రాణ ప్రతిష్టకు భారతీయులకు ప్రాతినిధ్యం వహించే సాధనంగా దేవుడు తనను ఎంచుకున్నాడని ప్రధాని మోదీ అన్నారు. ఈ అద్భుత సమయంలో తన మదిలో చెలరేగిన భావాలను వ్యక్తీకరించడం కష్టమని ప్రధాని తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అనుష్ఠానంలో ఏం చేస్తారంటే?
హిందూ శాస్త్రాల ప్రకారం ఆలయాల్లో ప్రాణప్రతిష్ఠాపనకు ముందు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముందు ఉపవాసం ఉండాలని కొన్ని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవడం, ప్రార్థనలు చేయడం, ఆహార నియమాలు పాటించడం వంటి నియమాల గురించి వాటిలో వివరించారు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రధాని మోదీ ఈ నియమాలన్నింటినీ పాటించాలని సంకల్పించుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ప్రధాని మోదీ చేతుల మీదుగానే జరగనుంది. జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. జనవరి 16 నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ వేడుకకు వేల మంది సాధువులు విచ్చేస్తారని నిర్వాహకులు తెలిపారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లోనూ వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
RSS చీఫ్‌కు ప్రాణప్రతిష్ఠ ఆహ్వానం- అయోధ్య రామయ్యకు కానుకల వెల్లువ
'అయోధ్య' ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్- బీజేపీ రాజకీయ ప్రాజెక్ట్ అంటూ విమర్శ