Telangana Autistic Singer Kamishetty Venkat : ఈ రోజుల్లో అన్ని అవయవాలు బాగున్నా.. ఏ పని చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు చాలా మంది. తను అలా కాదంటున్నాడు ఈ కడప కుర్రాడు. ఆటిజంతో బాధపడుతున్నా.. మల్టీ టాలెంటెడ్‌గా రాణిస్తున్నాడు. పలు అవార్డులు అందుకున్నాడు. ఇటీవల ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో ముందు నాటు నాటు పాటకు ఆడిపాడి.. ప్రశంసలు, మన్ననలు అందుకున్నాడు.
President Award for Autistic Singer Venkat : కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన వెంకట్ పుట్టినప్పటి నుంచే ఆటిజంతో బాధ పడుతుండేవాడు. 2 కిలోల బరువుతో పుట్టి.. చర్మం ముడతలు పడి.. అసలు పిల్లాడిలో కదలికలు లేవని తల్లిదండ్రులు విశాలాక్షి, రాధాకృష్ణయ్య వివరించారు. ఎన్ని నెలలైనా ఎదుగుదల లేదు.. రోజుకు 18 గంటలు ఏడ్చేవాడని తెలిపారు. రకరకాల ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారమన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇలాంటి పిల్లాడిని ఎందుకు భరిస్తున్నారని.. ఎక్కడైనా వదిలేయండని చాలా మంది ఉచిత సలహాలు ఇచ్చేవారని చెప్పారు.
Autistic Singer Telangana : ఎవరెన్నిమాటలు చెప్పినా తమ పేగుబంధం ఒప్పుకోక.. తన కొడుకును తాను తీర్చి దిద్దుతానంటూ తల్లి విశాలాక్షి ప్రయత్నం మొదలు పెట్టింది. అందుకే ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధులు లేరంటారు. అందుకే ఈ అమ్మ ప్రేమ ముందు ఆటిజం కూడా వెనక్కి తగ్గింది. సైగలు చేయడం. తర్వాత పెదాలతో ఒక్కో అక్షరం పలికించడం నేర్పింది ఈ యోధురాలు.
"అందరి అమ్మల్లాగే నేను కూడా నాకు పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నో కలలు కన్నాను. కానీ నాకు పుట్టిన అబ్బాయికి ఆటిజం ఉందనే విషయం తెలిసి బాధ పడ్డాను. రోజుకు 18 గంటలు ఏడుస్తూనే ఉండేవాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఏడుస్తున్నప్పుడు ముఖం మొత్తం ముడతలు పడిపోయేది. అది చూసి ఎంతో బాధ పడేదాన్ని. నా కొడుకు విషయంలో నా భర్త నాకు ఎంతో సాయపడ్డారు. నన్ను ఎంతో ప్రోత్సహించి ఇప్పుడు నా పిల్లాడిని ఈ స్థాయికి తీసుకువచ్చేలా చేశారు. " - విశాలాక్షి, వెంకట్ తల్లి
స్కూల్లో విద్యార్థుల మాటలూ, టీచర్ల పాఠాలూ, ఇంటికొచ్చాక పాటలూ.. రెండేళ్లు గడిచేసరికి స్పష్టంగా వెంకట్ మాట్లాడాడు. ట్యూన్ వింటే చాలు సుమారు 500 పాటలు నోటితో పాడేస్తున్నాడని తల్లిదండ్రులు తెలిపారు. పెదాలతో సైగలు చేసినా గుర్తు పట్టేస్తాడని.. అలా అతడిలోని ఈ కళను బయట ప్రపంచాలనికి తెలియడానికి తల్లిదండ్రులు ఎన్నో ప్రదర్శనలు ఇప్పించడం మొదలు పెట్టారు. ఇప్పటివరకు 500 ప్రదర్శనలు ఇచ్చినట్లు వారు చెప్పారు.
వెంకట్‌ను విభిన్న రంగాల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు ప్రయత్నాలు చేశారు. ఇలా విభిన్న రంగాల్లో రాణించడంతో గతంలో రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాడు. ఇటీవల వరంగల్‌కు వచ్చిన ప్రధాని మోదీని సైతం కలిసి .. ఆయన ముందే పాట పాడుతు నృత్యం చేస్తూ మురిపించాడు. దాంతో అక్కడున్న వారంతా చప్పట్లతో వెంకట్‌ను ప్రశంసించారు.
ఎన్నో అవార్డులు గెలుచుకున్న వెంకట్ : "మానసికంగా ఎదగని 15ఏళ్ల మా బాబు అసాధారణ ప్రతిభ విభాగంలో అవార్డు తెచ్చుకున్నాడు. దాని వెనక ఎంత కష్టపడ్డానో నాకూ, మావారికే తెలుసని వెంకట్ తల్లి విశాలాక్షి అంటున్నారు. పుట్టినప్పట్నుంచీ రోజులో గంటలకొద్దిన ఏడ్చిన తమ పిల్లాడు.. ఇప్పుడు రోజులో ఎక్కువ సమయం పాడుతూనే ఉంటున్నాడు" అని తండ్రి రాధాకృష్ణయ్య ఆనందం వ్యక్తం చేశారు.
తన ప్రతిభతో తెలుగురాష్ట్రాల్లో అనేక వేదికలపై పాటలు పాడి మెప్పించాడు వెంకట్.. వరంగల్ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఎదుట కూడా పాట పాడుతూ నృత్యం చేశాడు. ఆటిజాన్ని అవరోధంగా భావించకుండా వైవిధ్యభరితంగా రాణించడంతో వెంకట్ ప్రతిభను ప్రధాని ప్రశంసించారు. తన దృఢ సంకల్పానికి నా సెల్యూట్ అని ట్విటర్లో తెలిపారు. పట్టుదలతో సాధన చేస్తే విధిరాతనైనా మార్చవచ్చని ఈ యువకుడు నిరూపించాడు.
ఇవీ చదవండి :