PM CARES Fund: కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రారంభించిన పీఎం కేర్స్ నిధులు 2020-21 ఆర్థిక సంవత్సరంలో మూడు రెట్లు పెరిగి రూ.10,990 కోట్లకు చేరుకున్నాయి. ఈ ఫండ్ నుంచి మొత్తం రూ.3,976 కోట్లు వివిధ కార్యక్రమాల నిమిత్తం జారీ అయ్యాయి. ఇందులో రూ.వెయ్యి కోట్లు వలస కార్మికుల సంక్షేమం కోసం, రూ.1,392 కోట్లు కొవిడ్ టీకా డోసుల కోసం కేటాయించారు. పీఎం కేర్స్ నిధులకు సంబంధించి తాజా ఆడిట్ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.494.91 కోట్లు విదేశాల నుంచి వచ్చాయని నివేదికలో తేలింది. రూ.7,183 కోట్లు స్వచ్ఛంద విరాళాల రూపంలో వచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో పీఎం కేర్స్‌కు రూ.3076.62 కోట్ల విరాళాలు అందాయి. ఇవన్నీ ఐదు రోజుల వ్యవధిలోనే రావడం విశేషం.
- రూ.వెయ్యి కోట్లు.. వలస కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రాలకు జారీ చేసిన మొత్తం
- రూ.1,392 కోట్లు.. 6.6 కోట్ల కొవిడ్ టీకా డోసుల కొనుగోలు కోసం
- రూ.1,311 కోట్లు.. మేడిన్ ఇండియా వెంటిలేటర్ల కోసం
- రూ.201.58 కోట్లు.. ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం
- రూ.50 కోట్లు... ముజఫర్‌పుర్, పట్నాలలో 500 పడకల కొవిడ్ ఆస్పత్రులు, తొమ్మిది రాష్ట్రాల్లో 16 ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ ల్యాబ్‌ల కోసం
- రూ.20.4 కోట్లు.. కొవిడ్ టీకాలపై పనిచేస్తున్న ల్యాబ్‌ల అప్‌గ్రేడేషన్ కోసం
- రూ.1.01 లక్షలు- బ్యాంకు ఛార్జీలు
- 2021 మార్చి 31న పీఎం కేర్స్‌లో రూ.7,013.99 కోట్ల నిధులు ఉన్నాయి.
పీఎం కేర్స్ ఫండ్‌లో వ్యక్తులు, సంస్థల స్వచ్ఛంద విరాళాలే ఉంటాయని నివేదిక పేర్కొంది. బడ్జెట్ నిధులేవీ అందవని స్పష్టం చేసింది.
2020 మార్చి 27న ఈ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ ప్రకటనతో దీనిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. అయితే, విపక్షాలు మాత్రం పీఎం కేర్స్ పారదర్శకతపై అనుమానాలు వ్యక్తం చేశాయి. 'ప్రధానమంత్రి జాతీయ విపత్తు నిధి' ఉన్నప్పటికీ.. పీఎం కేర్స్‌ను ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నించాయి.
ఇదీ చదవండి: కాంగ్రెస్‌పై మోదీ ఫైర్.. ఓడినా అహంకారం తగ్గలేదంటూ..