ఏదైనా నియోజకవర్గంలో నోటాకు పోలైన ఓట్లు అధికంగా ఉంటే ఎన్నికల ఫలితాలను రద్దు చేసి, తిరిగి ఓటింగ్ నిర్వహించేలా భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. భాజపా నేత, ప్రముఖ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. రద్దైన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, తర్వాతి ఎన్నికల్లో నిలబడకుండా అడ్డుకోవాలని పేర్కొన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులను, రాజ్యాంగాన్ని పరిరక్షించే సుప్రీంకోర్టు ఈ దిశగా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.
ఈ తిరస్కరించే హక్కు.. అవినీతి, నేర స్వభావం, కులతత్వం, భాషా, ప్రాంతీయతత్వం వంటి రాజకీయాలను నివారించేందుకు ఉపయోగపడుతుందని పిటిషనర్ అశ్వినీ పేర్కొన్నారు.
"ఈ ఆదేశాలు అమలు చేస్తే నిజాయితీ, దేశభక్తి కలిగిన అభ్యర్థులకే టికెట్ ఇచ్చేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి పెరుగుతుంది. పార్టీల తరఫున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓడిపోయిన అభ్యర్థులు మళ్లీ అలా చేయకుండా నివారించగలుగుతాం."
-పిటిషన్లో అశ్వినీ ఉపాధ్యాయ్
పోటీ చేసే అభ్యర్థులను తిరస్కరించే హక్కు ఉండటం నిజమైన ప్రజాస్వామ్యాన్ని సూచిస్తుందని పిటిషనర్ పేర్కొన్నారు. అభ్యర్థులు.. ఎన్నికల ప్రక్రియలో జవాబుదారీగా ఉండేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి- 'రైతులకు సాగు చట్టాలు అర్థం కాలేదు'