PM photo on vaccination certificate: కొవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోను తొలగించాలని కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ విచారణ అర్హతను పరిశీలించిన జస్టిస్ పీవీ కున్హిక్రిష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం.. టీకా ధ్రువపత్రంపై ప్రధాని ఫొటో ఉంటే ఇబ్బంది పడుతున్నారా? అని ప్రశ్నించింది.
టీకా ధ్రువపత్రాలపై ప్రధాని ఫొటోలు ముద్రించటం విదేశాల్లో లేవని పిటిషనర్ తరఫు న్యాయవాది పీటర్ మ్యాలిపరంపిల్ తెలిపిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. ధ్రువపత్రం అనేది వ్యక్తిగత వివరాలతో కూడిన ప్రైవేట్ స్థలంగా పేర్కొన్నారు పిటిషనర్ తరఫు న్యాయవాది. ఓ వ్యక్తి గొప్యతలో కలుగజేసుకోవటం సరికాదని తెలిపారు. సర్టిఫికెట్‌కు ప్రధానమంత్రి ఫొటోను జోడించటం వ్యక్తి ప్రైవేట్ స్థలంలోకి చొరబడటమేనని వాదించారు.
" దేశ ప్రజలు ప్రధానిని ఎన్నుకున్నారు. వాక్సినేషన్ సర్టిఫికెట్‌పై ఆయన ఫొటో ఉంటే తప్పు ఏంటి? విదేశాల్లో వారి ప్రధానిని చూసి గర్వపడకపోవచ్చు. మనం మన ప్రధానిని చూసి గర్విస్తున్నాం. ప్రధాని పట్ల మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ప్రజల తీర్పుతో ఆయన అధికారంలోకి వచ్చారు. మనకు వేరువేరు రాజకీయ ఆలోచనలు ఉండవచ్చు. కానీ, ఆయన మన ప్రధాని. 100 కోట్లకుపైగా ఉన్న దేశంలో ప్రధాని ఫొటోతో ఎవరికీ ఇబ్బంది రానప్పుడు.. మీకే ఎందుకు కలిగింది? పిటిషన్ విచారించేందుకు అర్హత ఉందా అనే అంశాన్ని పరిశీలిస్తాం. ఎలాంటి సానుకూల అంశం లేకపోతే పక్కన పెట్టేస్తాం."
- ధర్మాసనం.
మరోవైపు.. ప్రధాని పట్ల గర్వపడటం అనేది వ్యక్తిగత అంశమని, ఇది రాజకీయ విబేధాలతో కూడిన అంశం కాదని పేర్కొన్నారు మరో న్యాయవాది అజిత్ జాయ్. ప్రజాధనంతో ఇచ్చే ప్రకటనలకు సుప్రీం కోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిందని, సర్టిఫికెట్‌పై ఫొటో ద్వారా ఓటర్లు ప్రభావితమవుతారని పేర్కొన్నారు. ఈ వాదనను తిరస్కరించిన కేంద్రం.. పిటిషన్ దాఖలును పబ్లిసిటీ కోసం చేసిన పనిగా పేర్కొంది.
పీఎం కేర్స్‌పై కేంద్రానికి నోటీసులు..
పీఎం కేర్స్ ట్రస్ట్ నిధి వెబ్సైట్ నుంచి ప్రధాని పేరు, ఫొటోను తొలగించాలన్న పిటిషన్‌పై డిసెంబర్ 23లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది బాంబే హైకోర్టు. కాంగ్రెస్ సభ్యుడు విక్రాంత్ చావన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈమేరకు స్పందించింది. ఇది ముఖ్యమైన అంశమని పేర్కొంది.
ఇదీ చూడండి: కొవిడ్ ధ్రువపత్రాలపై మోదీ ఫొటో తొలగింపు-కారణం ఇదే!