కర్ణాటక.. బెంగళూరులో విషాదం నెలకొంది. కబడ్డీ టోర్నమెంట్లో ఆడుతున్న ఓ విద్యార్థిని మరణించింది. ప్రత్యర్థి జట్టు క్యాబిన్లోకి రైడ్‌కు వెళ్లగా.. ఒక్కసారిగా అందరూ ఆమెను పట్టుకున్నారు. ఆ సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు శివారు ప్రాంతమైన అత్తిబెలెలో ఉన్న సెయింట్ ఫిలోమినా విద్యాసంస్థల్లో క్రీడాత్సోవాలు జరుగుతున్నాయి. విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అదే కళాశాలలో బలగారహళ్లికి చెందిన సంగీత(19).. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది.
బుధవారం.. క్రీడాత్సవాల్లో భాగంగా అమ్మాయిలకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. సంగీత కూడా అందులో పాల్గొంది. ఆటలో భాగంగా ప్రత్యర్థి జట్టు క్యాబిన్లోకి రైడ్‌కు ఆమె వెళ్లింది. ఒక్కసారిగా అందరూ ఆమెను పట్టుకున్నారు. ఆ సమయంలో గుండెపోటుకు గురై కుప్పకూలింది. గమనించిన సిబ్బంది.. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సంగీత మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అత్తిబెలె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థిని మృతి కారణంగా గురువారం.. సెయింట్ ఫిలోమినా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
రెండు రోజుల క్రితం, దహంగేరే జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. కర్ణాటక పబ్లిక్ స్కూల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించాడు. జిల్లాలోని హరిహర తాలూకాకు చెందిన ఎన్. విజయ్ కుమార్.. పిల్లలకు చదువు చెప్పేందుకు క్లాస్‌రూమ్‌లోకి వెళ్లాడు. ఆ సమయంలో ఛాతిలో నొప్పి రావడం వల్ల ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే విద్యార్థులు.. ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందించారు. అందరూ కలిసి హుటాహుటిన విజయ్‌కుమార్‌ను.. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.