Pilot Varun Singh: కూనూర్ హెలికాప్టర్ ప్రమాదం ఘటనలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్‌ను వెల్లింగ్టన్ ఆసుపత్రి నుంచి బెంగళూరుకు తరలించారు. ఈ విషయాన్ని ఆయన తండ్రి కర్నల్ కేపీ సింగ్(రిటైర్డ్) వెల్లడించారు. వరుణ్ సింగ్ ఆరోగ్యంపై ఇప్పుడే ఏం చెప్పలేమని ఆయన అన్నారు.
అంతకుముందు.. వరుణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై పార్లమెంట్ వేదికగా ప్రకటన చేశారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ప్రస్తుతం వరుణ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉన్నారని, అవసరమైతే బెంగళూరు కమాండ్ ఆసుపత్రికి తరలిస్తామని స్పష్టం చేశారు.
శౌర్య చక్ర..
వరుణ్ సింగ్ తండ్రి.. ఏఏడీ(ఆర్మీ ఎయిర్ డిఫెన్స్)లో విధులు నిర్వహించారు. వరుణ్ సోదరుడు తనూజ్.. ప్రస్తుతం నేవీలో లెఫ్టినెంట్ కమాండర్.
వరుణ్ ఇప్పటికే ఓసారి మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చారు. గతేడాది అక్టోబర్‌లో.. ఆయన నడుపుతున్న తేజస్ విమానంలో.. గాలిలో ఉన్న సమయంలోనే అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో వరుణ్.. విమానం నుంచి దూకేందుకు ఆస్కారం ఉంది. అయినప్పటికీ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ, సమయస్ఫూర్తితో విమానాన్ని నడిపారు. పరిస్థితులను అర్థం చేసుకుని విమానాన్ని సురక్షితంగా నేలకు తీసుకొచ్చారు. వరుణ్ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆయన్ని శౌర్య చక్రతో సత్కరించింది.
రాష్ట్రపతి ట్వీట్..
యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ తమిళనాడులో బుధవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో జనరల్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు.
ఈ నేపథ్యంలో ట్వీట్ చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. "హెలికాప్టర్ ప్రమాదానికి గురైన గ్రూప్ కమాండర్ వరుణ్.. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా" అని అన్నారు.
కాంగ్రెస్ కూడా ట్వీట్ చేసింది. 'కోట్లాది మందితో పాటు కాంగ్రెస్ కుటుంబం కూడా.. వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోంది' అని పోస్ట్ చేసింది.
ఇవీ చూడండి:-