కరోనా మహమ్మారి విజృంభణతో ఆక్సిజన్ కొరత ఏర్పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ప్రాణవాయువును ఉత్పత్తి చేసేందుకు తూత్తుకుడి వేదాంత స్టెరిలైట్ కాపర్ యునిట్‌ను తమిళనాడు ప్రభుత్వం ఎందుకు తమ అధీనంలోకి తీసుకోలేకపోతుందని ప్రశ్నించింది.
పర్యావరణ కాలుష్యంపై వివాదంతో 2018, మేలో మూతపడిన వేదాంత స్టెరిలైట్ యూనిట్‌ను ఆక్సిజన్ ఉత్పత్తి కోసం తెరవాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టింది ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
" వేదాంత, ఇతర ఏ, బీ, సీ సంస్థలను నడిపించటంపై మాకు ఎలాంటి ఆలోచన లేదు. మా ఆలోచనంతా ఆక్సిజన్ ఉత్పత్తి చేయటంపైనే. ఆక్సిజన్ లేక ప్రజలు చనిపోతున్నందున పటిష్ఠ చర్యలు చేపట్టాలి. "
- ధర్మాసనం.
తూత్తుకుడిలో శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, ఈ విషయంలో ప్రజలతో ఆ జిల్లా కలెక్టర్ మాట్లాడేందుకు శుక్రవారం ఉదయం వెళ్లారని కోర్టుకు తెలిపారు తమిళనాడు తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్. ప్రజలు ఆందోళన చేసే అవకాశం ఉందన్నారు. కేంద్రంతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. గురువారం విచారణ సందర్భంగా శాంతిభద్రతల అంశాన్ని ఎందుకు తెలపలేదని ప్రశ్నించింది ధర్మాసనం. ప్రస్తుతం పరిస్థితులు వేరని స్పష్టం చేసింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేస్తానని న్యాయవాది తెలిపారు.
మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ప్లాంట్‌ను స్వాధీనం చేసుకొని ఆక్సిజన్ తయారు చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. ప్లాంట్ ద్వారా ప్రభావితమైన కుటుంబాలు తెలిపాయి. దేశం ఆక్సిజన్ కొరతలో ఉందని, వేదాంత ప్లాంట్‌ను ఎవరు నడిపించినా తమకు ఇబ్బంది లేదని కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
వాదనలు విన్న తర్వాత విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేసింది ధర్మాసనం.
స్థానికుల వ్యతిరేకత..
తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్ తిరిగి తెరవాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన నేపథ్యంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేయగా.. పెద్ద సంఖ్యలో పాలనాధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ప్లాంట్ ప్రారంభించటాన్ని వ్యతిరేకించారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో ప్లాంట్‌ను ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుని నడిపిస్తే ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అని అడగగా.. అందుకు కూడా వారి నిరాకరించారు.
ఇదీ చూడండి: ఆక్సిజన్ కొరతపై సుప్రీం సీరియస్