People Buried In Well In Silli : బావిలో పడిన పశువును రక్షించేందుకు ప్రయత్నించి అందులోనే కూరుకుపోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాజధాని రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలోని సిల్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిస్కా గ్రామంలో జరిగింది. మొత్తం 8 మంది బావిలో కూరుకుపోగా.. ముగ్గురు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు.
ఇదీ జరిగింది
పిస్కా గ్రామంలో సాయంత్రం ఓ ఎద్దు బావిలో పడింది. దీనిని గమనించిన స్థానికులు దానిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు.ఈ క్రమంలోనే నలుగురు గ్రామస్థులు తాడు సహాయంతో బావిలోకి దిగగా.. మరో నలుగురు పైన ఉండి బయటకు లాగుతున్నారు. ఈ సమయంలోనే బావిపైన ఉన్న మట్టిదిబ్బలు కూలడం వల్ల ఒక్కసారిగా నలుగురు బావిలో పడ్డారు. ఫలితంగా పైకి వస్తున్న మరో నలుగురు సైతం బావిలోనే కూరుకుపోయారు. దీనిని గమనించిన స్థానికులు బావిలో కూరుకుపోయిన ఓ వ్యక్తిని మొదట సురక్షితంగా బయటకు తీశారు. మిగిలిన ఏడుగురిలో బావిలోని మట్టిలో కూరుకుపోయారు.
మృతదేహాల వెలికితీతకు ప్రత్యేక యంత్రాలు
సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో కూరుకుపోయిన ఎనిమిది మందిలో ముగ్గురిని సురక్షితంగా బయటకు తీశారు. మిగిలిన ఐదుగురు మరణించినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతానికి ఒకరి మృతదేహాన్ని బయటకు తీయగా.. మిగిలిన నలుగురి మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేపట్టారు. చీకటి కావడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. మట్టిలో పూర్తిగా కూరుకుపోవడం వల్ల వారిని బయటకు తీయడం కష్టంగా మారింది. దీంతో అధికారులు బావిని తవ్వే యంత్రాన్ని ప్రమాద స్థలానికి రప్పించారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సుదేశ్ మహాతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు.
"సిల్లీ సమీపంలోని మురి గ్రామంలో 8 మంది బావిలో కూరుకుపోయారని తెలిసింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందానికి ఈ సమాచారాన్ని చేరవేశాం. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది."
--శుభాంషు జైన్, ఎస్పీ రాంచీ
100 అడుగుల బావిలో చిక్కుకున్న వ్యక్తి మృతి.. 48 గంటల తర్వాత..
మృత్యువుతో 45 గంటల పోరాటం.. 70 అడుగుల గుంతలో నుంచి ఎట్టకేలకు బయటకు..