Pawan Kalyan Sensational Comments : విశాఖ జిల్లాలో పెద్దఎత్తున భూముల దోపిడీ జరుగుతోందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్, మైనింగ్ వ్యాపారం ద్వారా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు రూ.వేల కోట్లు అక్రమంగా వెళ్తోందని తెలిపారు. జగన్.. రాజకీయ నాయకుడు కాదు.. వ్యాపారి అని చెప్పిన పవన్.. బ్రిటీష్ హయాం కంటే తీవ్రంగా విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు. అన్నీ బేరీజు వేసి చూస్తే టీడీపీ పాలనే మంచిదనిపించిందని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతాం అని స్పష్టం చేశారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి.. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం వస్తుంది అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
కడప కర్మాగారానికి బాక్సైట్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన పవన్.. ఆంధ్రప్రదేశ్ నేరాలకు ( Crime rate in AP ) నిలయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో పెద్దఎత్తున భూముల దోపిడీ జరుగుతోందని, లాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వుతున్నారని తెలిపారు. విశాఖ జిల్లాలో 271 ఎకరాల్లో తవ్వకాలు జరిపి కడప సిమెంట్ కర్మాగారానికి పంపుతున్నారని వెల్లడించారు. ఖనిజాల తవ్వకాలతో పర్యావరణం తీవ్ర స్థాయిలో విధ్వంసం జరుగుతోందన్న పవన్ కల్యాణ్.. తూ.గో. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో లాటరైట్ తవ్వకాలు జరుగుతున్నట్లు గిరిజనులు తెలిపారని అన్నారు. నాతవరం మండలంలో భారీగా జరుగుతున్న ఖనిజాల తవ్వకాలపై విచారణ చేయాలని కోరితే స్పందన లేదని పేర్కొన్నారు.
బాలికలు అదృశ్యం.. పెంపకంలో లోపమా..? చిత్తూరులో ఒకేరోజు చాలామంది బాలికలు అదృశ్యమయ్యారన్న పవన్ కల్యాణ్.. దర్యాప్తు చేయాలని కోరితే ఏమీ జరగనట్లే పోలీసులు మాట్లాడుతున్నారని తెలిపారు. ఏ ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడుతారని ఎదురు ప్రశ్నిస్తున్నారని చెప్తూ.. పోలీస్‌స్టేషన్ ( Police Station ) వరకు రాకముందే చాలా పిటిషన్లు నా వద్దకు వస్తున్నాయని చెప్పారు. ఆడపిల్లల అదృశ్యంపై పోలీసులను ప్రశ్నిస్తే.. తల్లిదండ్రుల పెంపకం లోపమని చెబుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో నేరాల తీవ్రత ( Tadepalli ) పెరిగిందన్న పవన్.. పోలీసుల వద్దకు వెళ్తే ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని అన్నారు.
భవిష్యత్లో కొత్త ప్రభుత్వమే.. వైసీపీ ప్రభుత్వం సహజ వనరులను దోచుకుంటోందన్న పవన్.. వనరుల దోపిడీకి బాధ్యులైన వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వచ్చేది జనసేన ప్రభుత్వమా.. జనసేన, టీడీపీ కలిపిన ప్రభుత్వమా.. ఏదైనా, ఏ ప్రభుత్వమైనా సరే నేరస్థులను వదిలిపెట్టం అని పవన్ హెచ్చరించారు. తాను పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానన్న పవన్.. సీఎంగా చేయడానికి సంసిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రభుత్వ రంగ, సహకార రంగ సంస్థలను అభివృద్ధి చేయాలని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ( Steel Plant ) విషయంలో సీఎం ఎందుకు మాట్లాడటం లేదని పవన్ ప్రశ్నించారు. ఓట్లు చీలకుండా ఉండాలని అనడానికి సాక్షి యజమానే కారణం అని పవన్ వెల్లడించారు. యువతులు అదృశ్యమైతే సీఎం స్పందించలేదని, అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తులు దోచుకుంటున్నారని అన్నారు. అన్నీ బేరీజు వేసి చూస్తే టీడీపీ పాలనే మంచిదనిపించిందని, వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతాం అని స్పష్టం చేశారు. పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి.. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం వస్తుంది అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.