Bihar Caste Census Patna High Court : బిహార్‌లోని నీతీశ్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనకు మార్గం సుగమమైంది. సామాజిక న్యాయంతో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన నిర్ణయం పూర్తిగా చెల్లుబాటు అవుతోందని స్పష్టం చేసింది పట్నా హైకోర్టు. కులాల వారీగా జనగణనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను పట్నా హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే వినోద్, జస్టిస్ పార్థసారథితో కూడిన ద్విసభ్య ధర్మాసనం 101 పేజీలతో కూడిన తీర్పును వెలువరించింది.
'హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకు వెళతాం'
అయితే, పట్నా హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పిటిషనర్ల తరఫున న్యాయవాది దిను కుమార్ తెలిపారు. 'కులాలవారీగా జనాభా గణనపై పట్నా కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. తీర్పు కాపీ వచ్చిన తర్వాత స్పష్టత వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించవచ్చని హైకోర్టు తీర్పు సూచిస్తుంది.' అని దిను కుమార్ చెప్పారు.
హైకోర్టు నిర్ణయంపై తేజస్వీ హర్షం
కుల గణనను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లను పట్నా హైకోర్టు తిరస్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. మోదీ ప్రభుత్వం ఓబీసీలను అణచివేస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ కుల గణనను ఎందుకు అడ్డుకుంటోందని ప్రశ్నించారు. "మా ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో కుల గణన చేపడుతోంది. దీని ద్వారా ఓబీసీ, ఈబీసీలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఆర్థిక, సామాజిక న్యాయం కోసం ఇదో విప్లవాత్మక అడుగు." అని ట్వీట్ చేశారు.
Bihar Caste Census Stay : అంతకుముందు మేలో ఈ పిటిషన్లపై విచారించిన పట్నా హైకోర్టు.. కుల గణన, ఆర్థిక సర్వేపై స్టే విధించింది. రాష్ట్రంలో జరుగుతున్న కుల గణనను తక్షణమే నిలిపివేయాలని.. ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని భద్రంగా ఉంచాలని.. ఎవ్వరితోనూ పంచుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేవీ చంద్రన్, జస్టిస్ మధురేశ్ ప్రసాద్‌తో కూడిన డివిజన్ బెంచ్.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Caste Census In Bihar : కుల గణన ద్వారా.. రాష్ట్రంలోని వివిధ కులాల అభ్యున్నతికి పాటుపడేందుకు వీలుగా వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల గురించి సమాచారం అందుబాటులో వస్తుందన్న అంచనాతో బిహార్ ముఖమంత్రి సీఎం నీతీశ్ కుమార్ 2023 జనవరి 7న సర్వే ప్రారంభించారు. 2.9 కోట్ల కుటుంబాల్లోని 12.7 కోట్ల మంది వివరాలను ఆఫ్‌లైన్‌లో, మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో పొందుపర్చేందుకు బిహార్ ప్రభుత్వం ఈ గణన చేపట్టింది.
ఇవీ చదవండి : నీతీశ్‌కు షాక్.. బిహార్‌లో కుల గణనపై హైకోర్టు స్టే