వైద్యులే నిర్లక్ష్యం చేసి తన కుమారుడి కాలు తొలగించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ తల్లి. ఈ ఘటన బిహార్‌లోని పట్నాలో జరిగింది.
ఇదీ జరిగింది....
కొన్ని రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహ్మద్ ఆరిఫ్ (18) కాలుకు తీవ్రంగా గాయమైంది. దీంతో, ఆరిఫ్ తల్లి హలీమా ఖాటున్... తన కుమారుడిని పట్నా మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ సమయంలో ఆసుపత్రిలో పనిచేస్తోన్న జూనియర్ డాక్టర్ ఆరిఫ్ కాలుకు పట్టీ వేశాడు. కొన్ని రోజుల తర్వాత బాధితుడికి కాలు నొప్పి సమస్య మరింత పెరిగింది. దీంతో ఆరిఫ్‌ను మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లింది హలీమా. ఈసారి మరో వైద్యుడు... అతడి కాలు తొలగించాలని చెప్పాడు.
"నా భర్త మానసిక సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పుడు నా కొడుకు కాలు తొలగించారు. ఇద్దరి వైద్యానికి సరిపడే డబ్బు నా దగ్గర లేదు. అందుకే డాక్టర్లు... ఆరిఫ్‌ను డిశ్చార్జి చేయాలని ఒత్తిడి చేస్తున్నారు" అని బాధితుడి తల్లి హలీమా ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఆరోపణలను తిప్పికొట్టారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విమల్ కర్కర్. ఈ విషయంపై దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.