బిహార్ రాజకీయాల్లో కొత్త మలుపు చోటు చేసుకుంది. లోక్ జనశక్తి పార్టీ(LJP) లోక్‌సభాపక్ష నేతగా చిరాగ్ పాసవాన్ స్థానంలో ఆ పార్టీ ఎంపీ పశుపతి కుమార్ పరాస్ ఎంపికయ్యారు. ఆరుగురు ఎంపీలున్న ఆ పార్టీలోని ఐదుగురు ఎంపీలు పరాస్‌ను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎల్జేపీకి చెందిన ఐదుగురు ఎంపీల బృందం... సోమవారం మధ్యాహ్నం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మరోమారు కలుస్తారని సమాచారం. స్పీకర్‌తో పశుపతి కుమార్ పరాస్ ఎంపిక గురించి మాట్లాడునున్నారని తెలుస్తోంది.
పరాస్ ఇంటికి పాసవాన్..
ఎల్జేపీలో ఐదుగురు ఎంపీల వ్యతిరేకత నేపథ్యంలో చిరాగ్ పాసవాన్ అప్రమత్తమయ్యారు. ఈ వ్యవహారాన్ని తేల్చుకోవడానికి దిల్లీలో తన బాబాయి అయిన ఆ పార్టీ ఎంపీ పశుపతి కుమార్ పరాస్ ఇంటికి ఆయన సోమవారం చేరుకున్నారు. పాసవాన్ సోదరుడు మరో ఎంపీ ప్రిన్స్ రాజ్ కూడా అక్కడే ఉన్నారు. కానీ ఎవరూ ఆయనను ఇంట్లోకి పిలవక పోవడం వల్ల గంట సేపు గేటు బయట కారులోనే ఉండిపోయారు. తరువాత ఇంట్లో గంట సేపు ఉన్నా వారిద్దరూ కలవలేదు. పరాస్ ఇంట్లో లేరని అక్కడి వారు చెప్పగా పాసవాన్ నిరాశతో వెనుదిరిగారు.
ఇదీ చూడండి: చిరాగ్ వేరుకుంపటే జేడీయూను ముంచిందా?