పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు మూహూర్తం ఖరారైంది. జనవరి 29 నుంచి సభలు ప్రారంభమవుతాయని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భేటీ అవుతుందని, లోక్‌సభ సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సమావేశమవుతుందని వెల్లడించారు. సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం(క్వశ్చన్ అవర్) ఉంటుందని స్పష్టం చేశారు.
పార్లమెంట్‌కు వచ్చే ఎంపీలందరూ తప్పక కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ ఓంబిర్లా సూచించారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో జనవరి 27-28 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సభ్యుల ఇంటి వద్ద సైతం కొవిడ్ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఎంపీల కుటుంబ సభ్యులు, సిబ్బందికీ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖరారు చేసిన టీకా పంపిణీ విధానాలే పార్లమెంట్ సభ్యులకు వర్తిస్తాయని స్పష్టం చేశారు బిర్లా.
మరోవైపు, పార్లమెంట్ క్యాంటీన్లో సభ్యులకు అందించే సబ్సిడీ నిలిపివేసినట్లు తెలిపారు. దీంతో క్యాంటీన్లో ఆహార పదార్థాల ధరలు పెరగనున్నాయి. సబ్సిడీ తొలగించడం వల్ల సుమారు రూ.8 కోట్లు ఆదా అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, పార్లమెంట్ క్యాంటీన్‌ను ఇక నుంచి 'నార్తన్ రైల్వే'కు బదులు 'ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్' నిర్వహించనుందని బిర్లా స్పష్టం చేశారు.