Parliament Security Breach Case : లోక్‌సభలో భద్రతా వైఫల్యం ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఆరుగురు నిందితుల ఫేస్‌బుక్ ఖాతాలపై సమాచారం కావాలని ఫేస్‌బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటాకు దిల్లీ పోలీసులు లేఖ రాశారు. నిందితులందరూ ఒకరికొకరు పరిచయమైన వేదిక భగత్‌సింగ్ ఫ్యాన్ క్లబ్ ఫేస్‌బుక్ పేజీకి సంబంధించిన డేటా కూడా కావాలని కోరారు. ఘటన జరిగిన తర్వాత ఆ పేజీని నిందితులు తొలగించారు. నిందితుల వాట్సాప్ చాట్ వివరాలను కూడా దిల్లీ పోలీసులు సేకరిస్తున్నారు. పార్లమెంటులో అలజడి సృష్టించిన ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లలిత్ ఝా నిందితుల ఫోన్లను రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో దహనం చేశాడు. కాలిపోయిన ఫోన్లను ఆదివారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్‌కు పంపారు. అందులో డేటాను వెలికి తీసే అవకాశం ఉందో లేదో పరిశీలించాలని సూచించారు.
నిందితుల ఇళ్లకు వెళ్లి విచారణ
పార్లమెంట్‌లో అలజడి సృష్టించాలని నిందితులకు ఎవరి నుంచి అయినా డబ్బు అందిందా అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల వివరాలను పోలీసులు సేకరించారు. నిందితుల కుటుంబ సభ్యులను కలుసుకున్న పోలీసు బృందాలు బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించాయి. నీలం దేవీ, సాగర్ శర్మ బ్యాంక్ పాస్‌బుక్‌లను వారి ఇళ్ల నుంచి పోలీసు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. దిల్లీ పోలీసు ప్రత్యేక విభాగానికి చెందిన బృందాలు రాజస్థాన్, హరియాణా, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, బంగాల్, మహారాష్ట్రకు వెళ్లాయి. వీరి వెంట నిందితులు కూడా ఉన్నారు. మరో 50 బృందాలు దర్యాప్తులో భాగమయ్యాయి. షూ నుంచి స్మోక్ బాంబులు తీసిన మరో నిందితుడు సాగర్ ఇంటికి వెళ్లి కూడా విచారించారు పోలీసులు. వారితో పాటు సాగర్ కొనుగోలు చేసిన ఫుట్‌వేర్ షాపు యజమానిని సైతం ప్రశ్నించారు. ఘటన అనంతరం ప్రధాన సూత్రధారి లలిత్ దిల్లీ నుంచి రాజస్థాన్‌కు పారిపోయి ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
గతవారం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న సాగర్ శర్మ, మనోరంజన్ లోక్‌సభలో అలజడి సృష్టించారు. అదే సమయంలో అమోల్ శిందే, నీలం పార్లమెంట్ వెలుపల ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు కొనసాగుతుండటం వల్ల పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
'పార్లమెంట్ ఘటన తీవ్రతను తక్కువ అంచనా వేయొద్దు- విపక్షాల రాద్ధాంతం అనవసరం'
'ఒంటికి నిప్పంటించుకోవాలని నిందితుల ప్లాన్'- పార్లమెంట్ ఘటనలో విస్తుపోయే నిజాలు