Parliament Meeting 2022: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిరాటంకంగా సాగుతున్నాయి. సభ్యుల నుంచి ఎలాంటి ఆందోళనలు, వాయిదాలు లేకపోవడంతో తొలివారం రాజ్యసభలో 100శాతం ఉత్పాదకత నమోదైంది. దీనిపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు సంతృప్తి వ్యక్తం చేస్తూ సభ్యులను అభినందించారు. ఇదే ఉత్సాహంతో బడ్జెట్ సమావేశాల్లో మిగతా రోజులు, భవిష్యత్తులో జరగబోయే సమావేశాల్లోనూ చర్చలు జరపాలని కోరారు.
జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ కోసం మొత్తం 12 గంటలు కేటాయించగా.. ఇప్పటివరకు 7 గంటల 41 నిమిషాల ధన్యవాద తీర్మానంపై చర్చించారు. 26 మంది సభ్యులు మాట్లాడారు. వచ్చే మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధన్యవాద తీర్మానంపై ప్రసంగించే అవకాశమున్నట్లు రాజ్యసభ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి.
ఆ తర్వాత కేంద్ర బడ్జెట్ 2020పై రాజ్యసభ చర్చించనుంది. ఇందుకోసం 11 గంటలు కేటాయించగా.. వచ్చే శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై ప్రసంగించనున్నారు. ఇతర సభ్యులు లేవనెత్తిన అంశాలపై చర్చించిన తర్వాత బడ్జెట్ సమావేశాలు పూర్తికానున్నాయి.
ఇదీ చదవండి: Rahul Gandhi On Modi: ' ఏడాదిపాటు రైతులను రోడ్లపై వదిలేసిన మోదీ'