మృతిచెందిన తమ కుమారుడి చివరి కోరిక తీర్చేందుకు అతని అభిమాన హీరో చిత్రానికి కుమారుడి చిత్రపటంతో వెళ్లారు ఆ తల్లిదండ్రులు. సినిమా చూస్తున్నంత సేపు తమ కుమారుడిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్ డీఆర్సీ మల్టీప్లెక్స్‌లో సోమవారం జరిగింది.
పునీత్ రాజ్‌కుమార్ అభిమాని..
మైసూర్‌లోని కువేంపు నగర్లో నివసించే మురళీధర్ కుమారుడు హరికృష్ణన్.. ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు వీరాభిమాని. ఆయన నటించిన యువరత్న చిత్రాన్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అయితే ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం స్థానిక వరుణ కాలువలో స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లిన హరికృష్ణన్ ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు.
విషాదంలో మునిగిన ఆ తల్లిదండ్రులు హరికృష్ణన్‌కు తీరని కోరికగా మిగిలి పోయిన అతని అభిమాన హీరో చిత్రాన్ని చూసేందుకు సిద్ధమయ్యారు. కుమారుడు ఈ లోకంలో లేకపోయినా.. అతనికి కూడా థియేటర్లో టికెట్ బుక్ చేశారు. తల్లిదండ్రులు.. వారి మధ్య తమ కుమారుడి చిత్రపటాన్ని పెట్టుకుని.. తమతో పాటు అతను కూడా చిత్రాన్ని చూస్తున్నాడని భావిస్తూ భావోద్వేగాల మధ్య సినిమాను చూశారు. తల్లిదండ్రులతో పాటు హరికృష్ణన్ సోదరుడు కూడా చిత్రాన్ని తిలకించేందుకు వచ్చారు.
"నా కుమారుడు పునీత్ రాజ్‌కుమార్‌కు వీరాభిమాని. తను ఎప్పటినుంచో ఈ సినిమా చూడాలని అనుకుంటున్నాడు. అందుకే తన చిత్రపటంతో సినిమా చూశాము."
-మురళీధర్, హరికృష్ణన్ తండ్రి
పునీత్ రాజ్‌కుమార్ ట్వీట్..
ఈ ఘటనపై నటుడు పునీత్ రాజ్‌కుమార్ స్పందించారు. మురళీధర్ దంపతులు తమ కుమారుడి చిత్రపటంతో సినిమా చూస్తున్న చిత్రాలు చూసి తాను భావోద్వేగానికి గురయ్యానని పేర్కొన్నారు. హరికృష్ణన్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.
ఇదీ చదవండి : బెదిరింపులకు బెంగాలీలు వెరవరు: జయాబచ్చన్