Parents Supari to kill Alcoholic Son in Bhadradri : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మెడికల్ కాలనీకి చెందిన పగిళ్ల దుర్గాప్రసాద్ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు చేధించారు. మద్యానికి బానిసై.. తన ఖర్చుల కోసం ఉన్న ఇంటిని అమ్మేయాలంటూ హింసిస్తుండటంతో తల్లిదండ్రులే సుపారీ ఇచ్చి కుమారుడిని చంపించినట్లు గుర్తించారు. ఈ మేరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుమారుడు మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ బాధ్యతలను గాలికొదిలేశాడు. అక్కడితో ఆగకుండా.. తన ఖర్చులు, జల్సాలకు ఉన్న ఇంటిని అమ్మేయాలంటూ తల్లిదండ్రులను మానసికంగా హింసించడం ప్రారంభించాడు. దీంతో ఆ తల్లిదండ్రుల గుండె మండిపోయింది. కుమారుడు ఇక మన దారికి రాడనుకున్న ఆ దంపతులు.. మనసు చంపుకుని అతడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఓ ఇద్దరికి సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో ఈ నెల 9న ఈ హత్య జరిగింది. 10న వెలుగులోకి రాగా.. పోలీసులు విచారణ చేపట్టారు.
Parents Killed Their Son by Giving Supari in Badradri : మృతుడు తెలంగాణలోని భద్రాచలం మెడికల్ కాలనీకి చెందిన పగిల్ల రాము-సావిత్రి దంపతుల కుమారుడు దుర్గా ప్రసాద్(35)గా గుర్తించారు. రోజూ మద్యం తాగి ఇంటి కొచ్చి కుటుంబసభ్యులతో గొడవ పడుతూ ఉండేవాడని.. అతడి ప్రవర్తనతో విసిగిపోయిన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. అయినా అతడు తన తీరు మార్చుకోకుండా ఉన్న ఇంటిని అమ్మేయాలని తల్లిదండ్రులను హింసించేవాడని పేర్కొన్నారు. కుమారుడు పెడుతున్న బాధలను చాలాకాలంగా భరిస్తూ వస్తున్న వారిలో చివరకు సహనం నశించి.. అతడిని అంత మొందించేందుకు సిద్ధమయ్యారన్నారు. ఇందుకోసం భద్రాచలానికే చెందిన గుమ్మడి రాజు, షేక్ అలీ పాషా అనే వ్యక్తులకు రూ.3 లక్షల సుపారీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు.
ఈనెల 9న దుర్గా ప్రసాద్ ఇంట్లో నిద్రిస్తుండగా.. పథకం ప్రకారం అర్ధరాత్రి వేళ సుపారీ వ్యక్తులు గుమ్మడి రాజు, షేక్ అలీ పాషా. తల్లిదండ్రులు కలిసి కత్తితో అతడి మెడ కోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తీసుకొచ్చి తుమ్మలనగర్ అటవీ ప్రాంతంలోని గానుగ చెట్ల తోటలో పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఆ తర్వాత నలుగురూ ఊరు వదిలి పరారయ్యారు.
10వ తేదీన మధ్యాహ్నం సమయంలో పుల్లల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన వ్యక్తికి కాలిపోయిన శవం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు ప్రారంభించిన ఎటపాక పోలీసులు తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో మృతదేహం ఫొటోతో కరపత్రాలు అంటించారు. తెలంగాణలోనే ఉంటున్న మృతుడు దుర్గాప్రసాద్ భార్య ఆ ఫొటో తన భర్తదేనని గుర్తు పట్టి పోలీసులను ఆశ్రయించడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే తాజాగా అతడి తల్లిదండ్రులు, నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.