పన్నెండో తరగతి విద్యార్థుల మార్కులను నిర్ణయించే విధానంపై తల్లిదండ్రులు ఆందోళనలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందన తెలపాలని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. తదపరి విచారణను మంగళారం మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేసింది.
కరోనా కారణంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. వీరి మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్ ఫలితాల ఆధారంగా నిర్ణయిస్తామని, విద్యార్థలు పరీక్ష రాయాలనుకుంటే అవకాశమిస్తామని బోర్డులు ప్రకటించాయి.
దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డుల మూల్యంకనం స్కీమ్ ఏకపక్షంగా ఉందని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తుకు హాని కలుగుతుందని అభ్యంతరం తెలిపింది.
వీరి పిటిషన్లను విచారించిన జస్టిస్ ఏఏం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన సుప్రీం ధర్మాసనం.. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వాదనలను మంగళవారం వింటామని తెలపింది. ఈ అంశంపై దాఖలైన ఇతర పెండింగ్ పిటిషన్లనూ తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
విద్యార్థులకు అన్యాయం
సీబీఎస్ఈ స్కీమ్‌లో భాగంగా విద్యార్థులకు ఎక్స్టర్నల్ పరీక్ష రాసే అవకాశం ఇస్తే.. ఇంటర్నల్ పరీక్షల్లో ప్రతిభ చూపని వారికి కూడా గొప్ప ఛాన్స్ లభించినట్లవుతుందని ఉత్తర్‌ప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ తెలిపారు. ఇంటర్నల్ అసెస్మెంటా, లేక ఎక్స్టర్నల్ పరీక్ష రాయాలా అనే విషయాన్ని విద్యార్థి, పాఠశాలకు ప్రారంభ దశలోనే ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. విద్యార్థి/పాఠశాల ఎక్స్టర్నల్ పరీక్ష ఎంపిక చేసుకుంటే జులై మధ్యలో లేదా అనువైన సమయంలో పరీక్షలు నిర్వహించాలన్నారు.
విద్యార్థులకు కొంత ఆశా కిరణం ఉండాలి కానీ గందరగోళానికి తావు ఉండకూడదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరీక్షలు రద్ధ చేయాలనే నిర్ణయం ఉన్నత స్థాయిలో తీసుకున్నదని గుర్తు చేసింది.
మూల్యంకనం స్కీమ్‌పై విద్యార్థుల్లో అయోమయం నెలకొందని సింగ్ కోర్టుకు తెలిపారు. ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి ఏర్పడిందన్నారు.
సీబీఎస్ఈ కొత్త విధానం ప్రకారం ఓ విద్యార్థి ఇంటర్నల్ అసెస్మెంట్లో ఏ సబ్జెక్టులోనైనా సాధించిన మార్కులు (పదో తరగతిలో(30 శాతం), పదకొండో తరగతిలో (30 శాతం), పన్నెండో తరగతిలో (40 శాతం) ఆధారంగా ) ఆ పాఠశాల మాజీ విద్యార్థి సాధించిన అత్యుత్తమ మార్కుల కంటే అదనంగా రెండు మార్కులకు మించి ఉండడానికి వీల్లేదని వివరించారు. దీని వల్ల పాత విద్యార్థుల ప్రతిభ కారణంగా ప్రస్తుత విద్యార్థులు ప్రభావితమవుతారని పేర్కొన్నారు.