తూర్పు భారతంవైపుగా కరోనా మహమ్మారి కోరలు చాస్తూ వెళ్తోందని కేంద్రం ఆరోగ్య శాఖ తెలిపింది. అసోం, బంగాల్, ఒడిశా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో రోజువారీ కేసులు, మరణాలు సంఖ్య పెరగటం.. ఇందుకు సూచనలుగా కనిపిస్తున్నాయని పేర్కొంది. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నియంత్రణ, నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఈ ఐదు రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కె.పాల్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆస్పపత్రుల్లో కొవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన వారికి చికిత్స అందించడంలో.. మానవ వనరుల వినియోగ ప్రాధాన్యతను ఈ సమావేశంలో అధికారులు ప్రధానంగా ప్రస్తావించారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను అందిచాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఏఎన్ఎం, ఇతర ఆరోగ్య కార్యకర్తలకు సమయానికి వేతనాలు చెల్లించాలని తెలిపింది. నేషనల్ హెల్త్ మిషన్ నిధులను ఇందుకోసం వినియోగించాలని తెలిపింది. జిల్లా స్థాయిలో కరోనా కట్టడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఈ జిల్లాల్లోనే కేసులు ఉద్ధృతం..
రెండు వారాలుగా దేశంలోని 12 జిల్లాల్లో కరోనా కేసుల పెరుగుదల భారీగా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏడు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూసినట్టు అధికారులు తెలిపారు. వీటిలో కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ జిల్లా టాప్‌లో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై(తమిళనాడు), కొలికోడ్(కేరళ), ఎర్నాకుళం(కేరళ), గురుగ్రామ్(హరియాణా); త్రిస్సూర్(కేరళ), మలప్పురం(కేరళ), పట్నా(బిహార్), కొట్టాయం(కేరళ), మైసూరు(కర్ణాటక), చిత్తూరు(ఏపీ), దేహ్రాదూన్(ఉత్తరాఖండ్), సతారా(మహారాష్ట్ర), అలప్పుళ(కేరళ), సోలాపూర్(మహారాష్ట్ర) జిల్లాలు ఉన్నట్టు (రెండు వారాలతో పోలుస్తూ) ప్రత్యేక గ్రాఫ్‌లను విడుదల చేశారు.
మరోవైపు, ఇంతకుముందు భారీగా కొత్త కేసులు నమోదైన మహారాష్ట్రలోని 11 జిల్లాల్లో వైరస్ తగ్గుముఖం పట్టినట్టు నమోదైందని అధికారులు తెలిపారు. పుణె, ఠానే, ముంబయి, లాతూరు, ఔరంగాబాద్, ముంబయి సబర్బన్, నాందేడ్ తదితర జిల్లాల్లో గత రెండు వారాలుగా కేసులు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. దేశంలోని 24 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివిటీ రేటు 15శాతంగా ఉన్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: తల్లిదండ్రులకు తలకొరివి పెట్టిన కుమార్తెలు
ఇదీ చూడండి: కన్నడనాట కరోనా ఉప్పెన- కొత్తగా 50 వేల కేసులు