కొవిడ్ కారణంగా మృతిచెందిన బాధితులకు నష్టపరిహారం అందించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలు దరఖాస్తులుగా స్వీకరించాలని దిల్లీ హైకోర్టు సూచించింది. ఆక్సిజన్ కొరత, కొవిడ్‌తో మృతి చెందిన వారికి నష్టపరిహారంపై దాఖలైన పిల్‌ను న్యాయస్థానం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
దాఖలైన పిల్ ధరఖాస్తుగా స్వీకరించడం సహా దీనిపై సత్వర చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు ధర్మాసనం సూచించింది. నష్టపరిహారాన్ని మంజూరు చేయడం ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలని.. అందులో కోర్టులు జోక్యం చేసుకోవని స్పష్టం చేసింది.
బాధిత కుటుంబాలకు అందించే నష్టపరిహారం జాతీయ విపత్తు స్పందన నిధి (ఎన్డీఆర్ఎఫ్) లేదా పీఎం కేర్స్ నుంచి అందించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. రోజురోజుకు కొవిడ్ మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు నష్టపరిహారం అందించడంపై పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఆక్సిజన్, ఔషధాల కొరతతో రోగి మరణిస్తే అందుకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : 'వైరస్ నుంచి కోలుకున్నా.. ఇంటికి వెళ్లను'