Owaisi On Hijab: హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒకరోజు దేశ ప్రధానమంత్రి అవుతుందని ఎమ్‌ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ జోస్యం చెప్పారు. కర్ణాటకలో హిజాబ్ ధరించిన విద్యార్థినులను విద్యాసంస్థల్లోకి అనుమతించకపోవడంపై మండిపడుతూ తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను.. ఒవైసీ పోస్టు చేశారు.
హిజాబ్ ధరించిన మహిళలు తప్పకుండా కళాశాలలకు వెళ్లి.. కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, వైద్యులు, వ్యాపారవేత్తలు అవుతారని ఆయన పేర్కొన్నారు. తాను బతికి ఉన్నా, లేకున్నా.. ఏదో ఒకరోజు హిజాబ్ ధరించిన మహిళ దేశ ప్రధాని అవుతుందని, ఈ విషయాన్ని అంతా గుర్తుపెట్టుకోవాలని అసదుద్దీన్ తెలిపారు.
ప్రజల దృష్టిని మరల్చేందుకే..
ప్రజల దృష్టిని మరల్చేందుకు భాజపా.. హిజాబ్ వివాదాన్ని సృష్టించిందన్నారు ఒవైసీ.
"యూనిఫామ్ ధరించడం అనేది విద్యార్థి స్వచ్ఛంద నిర్ణయమే కానీ తప్పనిసరి కాదు. ఇదే విషయాన్ని బాబా సాహేబ్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. యూనిఫామ్లు అందరికీ ఒక్కలా ఉండవని.. అవి విద్యార్థుల మతాల ఆధారంగా ఉండే అవకాశం ఉందని ప్రధాని మోదీ అర్థం చేసుకోవాలి."
-అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం అధినేత
ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఓటమిని చవిచూస్తామనే భయంతో ఆ పార్టీ ఈ చర్యలకు పాల్పడుతోందని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు.
ఇదీ చూడండి: రెండో దశకు యూపీ సిద్ధం- ముస్లింలు, రైతుల ఓట్లే కీలకం!