కరోనా సమయంలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు 7 వరకు 9,800 మందికిపైగా చిన్నారులు అనాథలయ్యారు. 508 మంది చిన్నారులు నిరాదరణకు గురయ్యారు. 1.32లక్షల మంది తమ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయారు. ఈ మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్).. సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా కారణంగా తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులకు సంబంధించి దాఖలైన కేసును జస్టిస్ ఎల్. నాగేశ్వర్రావు నేతృత్వంలోని ధర్మాసనం సుమోటాగా సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్సీపీసీఆర్ దాఖలు చేసిన అఫిడవిట్లో కీలక సమాచారాన్ని వెల్లడించింది.
బాలస్వరాజ్ పోర్టల్-కొవిడ్ కేర్లో పొందుపరిచిన సమాచారం ప్రకారం.. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు 7 వరకు 9,855 మంది చిన్నారులు అనాథలుగా మారారాని ఎన్సీపీసీఆర్ తెలిపింది. 1,32,113 మంది చిన్నారులు తమ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయారని చెప్పింది. 508 మంది నిరాదరణకు గురయ్యారని వెల్లడించింది.
కరోనా కారణంగా వీధి బాలలుగా మారిన చిన్నారులను గుర్తించే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని ధర్మాసం అసహనం వ్యక్తం చేసింది. దీనిపై రాష్ట్రాలు, కేంద్రపాలిత సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆయా పిల్లలను గుర్తించి, వారికి తక్షణమే పునరావాసం కల్పించాలని తెలిపింది. ఈ ధర్మాసనంలో సభ్యునిగా ఉన్న జస్టిస్ బీ.ఆర్.గవాయి... వీధుల్లో లక్షలాది మంది చిన్నారులు ఉండవచ్చని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'నేతాజీ మరణించారా? బతికే ఉన్నారా? రెండు నెలల్లో చెప్పండి!'