Jayalalitha death: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణంపై విచారణ జరగుతోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకే నేత, మాజీ సీఎం ఓ పన్నీర్‌సెల్వం.. విశ్రాంత న్యాయమూర్తి ఏ అరుముఘస్వామి ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్ ఎదుట సోమవారం హాజరయ్యారు. జయలలిత మరణానికి ముందు జరిగిన విషయాలపై తన వాంగ్మూలం ఇచ్చారు.
" 2016 సెప్టెంబర్ 22న జయలలిత ఆస్పత్రిలో ఎందుకు చేరారనే విషయంపై నాకు ఎలాంటి వివరాలు తెలియదు. ఆమెకు అపోలో ఆస్పత్రి వైద్య బృందం ఏ చికిత్స ఇచ్చిందో కూడా తెలియదు. హాస్పిటల్ ముఖ్య కార్యదర్శి చెప్పిన తర్వాతే జయలలిత ఆస్పత్రిలో చేరారనే విషంయ నాకు తెలిసింది. ఆస్పత్రిలో చేరడానికి ఒక్కరోజు ముందు మెట్రో రైలు కార్యక్రమంలో జయలలిత పాల్గొన్నారు. అప్పుడే ఆమెను నేను చివరిసారి చూశా. ఆమెకు హై షుగర్ ఉందనే విషయం తప్ప, ఆమె ఆరోగ్య పరిస్థితిపై నాకు ఏమీ తెలియదు. అన్నింటికంటే ముఖ్యంగా జయలలిత మృతిపై విచారణ కమిషన్‌ను నేను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడే ఏర్పాటు చేశాం. ఆ ఫైల్‌పై నేను కూడా సంతకం చేశా." అని పన్నీర్ సెల్వం విచారణ కమిషన్ ఎదుట చెప్పారు.
అయితే మంగళవారం కూడా విచారణకు హాజరుకావాలని పన్నీర్‌సెల్వంకు కమిషన్ సూచించింది.
విచారణలో భాగంగా జయలలిత కోడలు ఇళవరసి కూడా జ్యుడీషియల్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఆమె ఏం చెప్పారంటే..
'జయలలిత ఆరోగ్య పరిస్థితిపై నాకు ఏమీ తెలియదు. ఆమె ఆస్పత్రిలో చేరారని తెలిసిన తర్వాత చూసేందుకు వెళ్లాను. గాజు గ్లాస్ ద్వారానే మాత్రమే ఆమెను చూశాను. నేరుగా కలవలేదు. నేను 75 రోజులు ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఒకట్రెండు సార్లు మాత్రమే ఆమెను గాజు గ్లాస్ ద్వారా చూశాను. బోయిస్ ఎస్టేట్‌లో ఆమెతో కలిసి ఉన్నప్పటికీ, ఎలాంటి వ్యక్తిగత వివరాలు ఆమె నాతో చెప్పేవారు కాదు. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు శశికళ ఒక్కరే ఆమె బాగోగులు చూసుకున్నారు' అని ఇళవరిసి కమిషన్‌తో చెప్పారు.
జయలలిత మృతిపై జస్టిస్ అరుముఘస్వామి కమిషన్ దర్యాప్తు చేస్తోంది. జనవరి 24తో ఈ కమిషన్ గడువు ముగిసినప్పటికీ డీఎంకే ప్రభుత్వం దాన్ని జూన్ 24వరకు పొడిగించింది. 2017 అన్నాడీఎంకే హయాంలోనే ఈ కమిషన్ ఏర్పాటైంది.
ఇదీ చదవండి: క్షీణించిన లాలూ ఆరోగ్యం.. రాంచీ నుంచి దిల్లీకి తరలింపు!