Opposition Party Meeting : విపక్ష ఇండియా కూటమి తర్వాతి దఫా సమావేశం కోసం ముహూర్తం ఖరారైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్‌లో తర్వాతి భేటీ జరగనున్నట్లు వెల్లడించాయి. భోపాల్‌లో మీటింగ్‌తో పాటు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపాయి. తర్వాతి దశ సమావేశం గురించి ముంబయి మీటింగ్‌లోనే చర్చలు జరిగాయని ఆయా వర్గాలు వివరించాయి. వివిధ పార్టీలన్నీ భోపాల్‌లో సమావేశానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపాయి.
అయితే, ఇందుకు సంబంధించి తేదీలు ఇంకా ఖరారు చేయలేదని వివరించాయి. అక్టోబర్‌లో ఈ సమావేశం జరిగే ఛాన్స్ ఉందని పేర్కొన్నాయి. సమావేశాల్లో చర్చించిన అంశాలు, ఇతర అజెండాలపైనా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి. మీటింగ్ నిర్వహణకు దిల్లీ పేరును సైతం పరిశీలించినట్లు కూటమి వర్గాలు చెప్పాయి. అయితే, చివరకు భోపాల్వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి ఇప్పటికి మూడుసార్లు సమావేశమైంది. పట్నాలో తొలి భేటీ జరగ్గా.. బెంగళూరు, ముంబయి నగరాల్లో మిగిలిన రెండు సమావేశాలు జరిగాయి.
Opposition Meeting Mumbai : విపక్ష కూటమి మూడో సమావేశం ముంబయిలో జరిగింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్డీయేను ఢీకొట్టేందుకు ఏర్పాటైన ఈ ఇండియా కూటమి మూడో సమావేశానికి.. 28 పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. ఈ కీలక భేటీలో వచ్చే ఎన్నికల నాటికి ఉమ్మడి పోరుకు చేయాల్సిన సన్నద్ధతపై సమాలోచనలు జరిపారు. ముందస్తుగా లోక్‌సభకు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాల మధ్య వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని పార్టీలు తీర్మానం చేశాయి. ఇందులో భాగంగానే 14 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది.
వివిధ రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు ప్రక్రియ తక్షణమే ప్రారంభిస్తున్నట్లు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి కూటమి పార్టీలు. దాంతోపాటు వివిధ భాషల్లో "భారత్ ఏకమవుతోంది.. ఇండియా గెలుస్తుంది" అనే థీమ్‌తో ప్రచార వ్యూహాలను రూపొందిస్తున్నట్లు తెలిపాయి. సెప్టెంబర్ 30 నాటికి సీట్ల సర్దుబాటు అంశాన్ని కొలిక్కి తెచ్చే దిశగా ప్రణాళికులు రచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇండియా కూటమి రెండో సమావేశం బెంగళూరులోనూ.. మొదటి మీటింగ్ పట్నాలోనూ జరిగాయి.
Opposition Meeting : ''ఇండియా' కూటమి 'బలం'.. మోదీ సర్కార్‌కు భయం భయం!'