Opposition CMs meeting in Delhi: దేశంలో భాజపాను ఎదిరించే కూటమి తయారవుతోందా? అంటే అవుననే సమాధానం స్పష్టంగా వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ఇందుకు అనుకూలంగానే ఉన్నాయి. అటు బంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్.. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని భాజపా సర్కారుకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని ఊవిళ్లూరుతున్నారు.
Mamata Banerjee third front
భాజపాను ఢీకొట్టాలని బలంగా నిశ్చయించుకున్న వారిలో బంగాల్ సీఎం మమతా బెనర్జీ ముందుంటారు. 2021లో ఎన్నికల విజయం తర్వాత జాతీయ స్థాయిలో భాజపా వ్యతిరేక పార్టీలకు ఆశా కిరణంగా మారారు. ఈ క్రమంలోనే దీదీ సైతం చకచకా అడుగులు వేస్తున్నారు. భాజపా-కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడినట్లు చెప్పారు. దేశ సమైక్య విధానాన్ని కాపాడేందుకు తాము కృషి చేస్తున్నామని చెబుతున్నారు.
పట్టుదలతో కేసీఆర్
KCR on BJP: 'మీరు అనుమతిస్తే దిల్లీ కోటలు బద్ధలుకొడతా. జనం కోరితే జాతీయ పార్టీ పెడతా. కేంద్రం అవినీతిని బయటపెడతా'.. ఇవి భాజపాను లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ ఇటీవల సంధించిన వరుస విమర్శనాస్త్రాలు. దేశవ్యాప్త రాజకీయాలకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఈ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. దీదీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గతమూడు రోజులుగా భాజపాపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రఫేల్ వివాదం, మతకల్లోలాలు, అవినీతి అంటూ కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. హౌడీ మోడీ సభను వ్యూహాత్మక తప్పిదంగా అభివర్ణించారు.
KCR National Politics
"దేశంలో రాజకీయ ఫ్రంట్ కాదు.. ప్రజల ఫ్రంట్ వస్తుంది. నిన్ననే నాతో మమతా బెనర్జీ మాట్లాడారు. బంగాల్‌కు ఆహ్వానించారు. త్వరలో ముంబయి వెళ్తా.. ఉద్ధవ్ ఠాక్రేను కలుస్తా. ఏదేమైనా ఈ విషయంలో నేను కీలక పాత్ర పోషిస్తా."
-కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి
దిల్లీలో సమావేశం...
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం వీరికి జతకలిశారు. బంగాల్లో గవర్నర్ జగ్దీప్ ధన్కడ్ వ్యవహారాన్ని తప్పుబడుతూ ట్వీట్ చేశారు స్టాలిన్. ముందస్తు సమాచారం లేకుండా అసెంబ్లీ సమావేశాలను ముగిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవడాన్ని ఆక్షేపించారు. అయితే, దీనికి గవర్నర్ సైతం దీటుగా బదులిచ్చారు. మమత విజ్ఞప్తి మేరకే అసెంబ్లీ సమావేశాలను ముగించానని తెలిపారు.
CMs meet Delhi Stalin
ఈ నేపథ్యంలో దీదీ, స్టాలిన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. భాజపాయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల అధికార దుర్వినియోగంపై చర్చించుకున్నారు. విపక్ష ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించాలని దీదీ పిలుపునిచ్చారని స్టాలిన్ పేర్కొన్నారు. ఇందుకు డీఎంకే మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. త్వరలోనే విపక్ష సీఎంల సమావేశం దిల్లీలో జరుగుతుందని స్టాలిన్ తెలిపారు.
కాంగ్రెస్ లేకుండానే...?
నిజానికి కాంగ్రెస్ లేని విపక్ష కూటమి ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్‌ను తమతో చేతులు కలపాలని కోరామని దీదీ చెబుతున్నారు. అయితే వారు మాత్రం సొంతదారిలోనే వెళ్తున్నారని, వారు వినకపోతే చేసేదేం లేదని అన్నారు. కాంగ్రెస్‌తో దీదీ అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష కూటమి ఏర్పాటు కాదనే ఆలోచనతో ఉన్నారు.
అయితే, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు... కాంగ్రెస్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ మద్దతుతోనే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సీఎం కుర్చీ దక్కించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కాంగ్రెస్‌ను దూరంగానే పెట్టారు. భాజపా-కాంగ్రెస్‌కు సమదూరం పాటిస్తామని కేసీఆర్ తరచుగా చెప్పే మాట. అయితే, గత రెండ్రోజులుగా భాజపాను తూర్పరాబట్టిన కేసీఆర్.. పలు విషయాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బాసటగా నిలిచారు. అసోం సీఎం రాహుల్‌పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు, సున్నితమైన సర్జికల్ స్ట్రైక్స్ అంశంపై రాహుల్ గాంధీ రుజువులు అడగటాన్ని సమర్థించారు.
Oppn CMs meeting in Delhi
ఈ నేపథ్యంలో దిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరగనుందని స్టాలిన్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో విపక్ష కూటమిపై కీలక ముందడుగు పడే అవకాశం ఉంది. ఎవరెవరు ఈ సమావేశానికి వెళ్లనున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్‌తో కష్టమే.. కేసీఆర్, స్టాలిన్‌తో కలిసి దిల్లీపై గురి!'