Lawyers write to CJI: నవంబర్ 17-19 మధ్య హరిద్వార్, దిల్లీలో జరిగిన పలు హిందుత్వ సంస్థల కార్యక్రమాలు, వాటిల్లో చేసిన విద్వేష ప్రసంగాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు 76 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు. సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
గాజియాబాద్‌లోని ఓ ఆలయానికి ప్రధాన అర్చకుడిగా వ్యవహరిస్తున్న యాతి నరసింహానంద్ సరస్వతి.. హరిద్వార్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఓ వర్గంపై హింసకు పాల్పడాలని గతంలో చేసిన విద్వేష ప్రసంగాల వల్ల పోలీసులు ఆయనపై ఇప్పటికే నిఘా వహిస్తున్నారు. అదే సమయంలో.. దిల్లీలో హిందూ యువవాహిని మరో కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ రెండింటిలోనూ.. పలువురు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారు. ఓ వర్గంపై మరణహోమానికి పాల్పడాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. అనేకమంది విపక్ష నేతలు వీటిని తప్పుబట్టారు.
Haridwar hate speech: ఈ వ్యవహారాన్ని సుమోటోగా పరిగణించాలని సీజేఐని కోరారు న్యాయవాదులు.
"ఆయా కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాలు.. కేవలం విద్వేషపూరితం మాత్రమే కాదు. ఒక వర్గం మొత్తాన్నే హత్య చేయాలని పిలుపునిచ్చారు. దేశ ఐకమత్యానికి, లక్షలాది మంది ముస్లింలకు ఆ ప్రసంగాలు ముప్పు పొంచి ఉంది. సంబంధిత వ్యక్తులపై 120బీ, 121ఏ, 153ఏ, 153బీ, 295ఏ, 298 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. గతంలోనూ ఇలాంటి ప్రసంగాలు మనం విన్నాము. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలాంటి ప్రసంగలు ఇప్పుడు సాధారణమైపోయాయి. ఈసారి అలా జరగకూడదు. న్యాయవ్యవస్థ సత్వరమే జోక్యం చేసుకోవాలి. సీజేఐగా మీరు మీ సామర్థ్యాన్ని ఉపయోగించి చర్యలు చేపడతారని ఆశిస్తున్నాము."
-- న్యాయవాదులు రాసిన లేఖ సారాంశం.
పట్నా హైకోర్టు మాజీ జడ్జి అంజునా ప్రకాశ్‌తో పాటు న్యాయవాదులు దుశ్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్, బృందా గ్రోవర్, మీనాక్షి ఆరోరా, సల్మాన్ ఖుర్షిద్ తదితరులు లేఖపై సంతకం చేశారు.
ఇదీ చూడండి:- 'ధర్మ సంసద్'లో విద్వేష ప్రసంగం- రాహుల్, ప్రియాంక ఫైర్