దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు(onion price in india) ప్రస్తుతం గత ఏడాదికంటే చౌకగానే ఉన్నాయని కేంద్ర వినియోగ వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ బుధవారం తెలిపింది. ప్రస్తుతం రిటైల్ ధర కిలోకి రూ.40.13, టోకు ధర క్వింటాల్‌కు రూ.3,215.92 మేర ఉన్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఫలితాలు వస్తున్నట్లు స్పష్టం చేసింది.
"వర్షాల కారణంగా సరఫరా దెబ్బతినడంతో అక్టోబర్ తొలివారం (onion price in india) నుంచి ఉల్లి ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి. అయితే ధరలను తగ్గించడం కోసం వినియోగ వ్యవహారాల శాఖ జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అడిగిన వారికి అడిగినట్లుగా బఫర్ నిల్వల (govt onion buffer stock) నుంచి ఉల్లి సరఫరా చేశాం. దానివల్ల ధర దిగివచ్చింది. నవంబర్ 2వ తేదీన హైదరాబాద్, దిల్లీ, కోల్‌కతా, లఖ్‌నవూ, పట్నా, రాంచీ, గువాహటి, భువనేశ్వర్, బెంగళూరు, చెన్నై, ముంబయి, ఛండీగఢ్, కోచి, రాయ్‌పుర్‌లాంటి ప్రధాన మార్కెట్లకు 1,11,376.17 మెట్రిక్ టన్నుల ఉల్లి సరఫరా చేశాం. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌ల్లోని స్థానిక మార్కెట్లకూ అందించాం. వినియోగ వ్యవహారాల శాఖ రాష్ట్రాలకు రూ.21కే కిలో ఇవ్వడానికి సిద్ధమైంది. రిటైల్ మార్కెట్ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు రవాణా ఖర్చులతో కలిపితే వచ్చే ధరకు (ల్యాండెడ్ ప్రైస్-వాస్తవ ధర) ఉల్లి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే దిల్లీకి చెందిన సఫల్ సంస్థ రూ.26 చొప్పున 400 టన్నులు తీసుకుంది. ధరల స్థిరీకరణ నిధితో వినియోగ వ్యవహారాల శాఖ బఫర్ నిల్వలు నిర్వహిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వలు పెట్టాలన్నది లక్ష్యం కాగా ఏప్రిల్-జులై మధ్యలోనే 2.08 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం" అని కేంద్ర ఆహారం, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ పేర్కొంది.
ఇదీ చదవండి:రెండు రోజులపాటు ట్రేడ్ యూనియన్ల సమ్మె