One Nation One Election Committee : దేశంలో జమిలి ఎన్నికల కోసం గత కొంతకాలంగా కసరత్తులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'ఒకే దేశం-ఒకే ఎన్నికల'పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా దిల్లీలోని కోవింద్ నివాసానికి వెళ్లి ఆయన్ను కలిశారు. సెప్టెంబరులో ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడిన మరుసటి రోజే జమిలి ఎన్నికల కోసం కమిటీ ఏర్పాటు చేసినట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
One Nation One Election News : దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ఆలోచనను మోదీ సర్కారు గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తోంది. ఇప్పుడు దీన్ని అమల్లోకి తెచ్చేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ బాధ్యతను మాజీ రాష్ట్రపతి కోవింద్‌కు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Parliament Special Session : అయితే సెప్టెంబరు 18 నుంచి 22 వరకు అయిదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్రం గురువారం అనూహ్య ప్రకటన చేసింది. అయితే ఈ సమావేశాలకు అజెండా ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. ప్రధానంగా ఈ ప్రత్యేక సమావేశాల్లో 'ఒకే దేశం.. ఒకే ఎన్నికలు' పేరుతో జమిలి ఎన్నికల బిల్లు తీసుకురాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ అంశంపై కమిటీని ఏర్పాటు చేసినట్లు వార్తలు రావడం.. ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లయింది.
జమిలి దిశగా వెళ్లాలంటే పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను కలిపి నిర్వహించడానికి రాజ్యాంగంలో కనీసం ఐదు అధికరణలను సవరించాలని ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ రాజ్యసభలో వెల్లడించారు. ఆ సవరణల కోసమే ప్రత్యేక సమావేశాల్లో బిల్లు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది చివర్లో నవంబరు-డిసెంబరు మధ్య ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక, ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది మే-జూన్ నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, తాజా పరిణామాలతో కేంద్రం లోక్‌సభను రద్దు చేసి ముందస్తుగానే జమిలి ఎన్నికలకు వెళ్లొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.