భారత్ - చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖకు వద్ద నిర్మాణ పనుల్లో ఉన్న 19 మంది వలస కూలీలు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ రెండు వారాలుగా తెలియడంలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, వీరిలో ఒకరి మృతదేహం సమీపంలోని నదిలో లభ్యమైనట్లు కథనాలు వస్తున్నాయి. మిగిలిన వారు కూడా నదిలో కొట్టుకుపోయి ఉండొచ్చని అనధికారిక సమాచారం. దీంతో అదృశ్యమైన కూలీల కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు. వివరాల్లోకి వెళితే..
అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల కురుంగ్ కుమే జిల్లాలోని దమిన్ సర్కిల్‌లో సరిహద్దు రహదారుల సంస్థ (బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ - బీఆర్‌ఓ) రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. ఇక్కడ పనిచేసేందుకు ఓ కాంట్రాక్టర్ 19 మంది కూలీలను అసోం నుంచి తీసుకొచ్చారు. అయితే, బక్రీద్ పండగ నిమిత్తం వీరు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సెలవు అడగ్గా.. కాంట్రాక్టర్ అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 5వ తేదీన ఈ కూలీలంతా తమ శిబిరాల నుంచి పారిపోయారు. అప్పటి నుంచి వీరు కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.
వీరు అదృశ్యం అయినట్లు జులై 13న స్థానిక పోలీస్ స్టేషన్‌లో కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టారు. నిర్మాణ సైట్ నుంచి వీరంతా అడవి మార్గంలో కాలినడకన వెళ్లి ఉంటారని, ఆ క్రమంలో దారితప్పి అడవిలో అదృశ్యమై ఉంటారని పోలీసులు భావించారు. అయితే, దమిన్ ప్రాంతంలోని కుమే నదిలో ఇటీవల ఓ మృతదేహం లభ్యమైంది. అది అదృశ్యమైన కూలీల్లో ఒకరిదంటూ సోషల్ మీడియా, స్థానిక మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. పారిపోతున్న క్రమంలో కూలీలంతా ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదృశ్యమైన కూలీలంతా అస్సాంలోని కొక్రాఝర్, ధుబ్రీ ప్రాంత వాసులుగా గుర్తించారు. వీరిని ఈ ఏడాది మేలోనే అరుణాచల్‌ప్రదేశ్‌కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
''పనులు జరుగుతున్న ప్రదేశం భారత్-చైనా సరిహద్దుకు చాలా దూరంలో ఉంది. సరిహద్దుతో సంబంధం లేదు. అరుణాచల్ ప్రదేశ్ పరిధిలోనే జరిగింది. మరణించిన వ్యక్తి.. వీరికి సంబంధించిన వారా లేక మరొకరా అన్నది పోలీసులు నిర్ధరిస్తారు.''
- తాపిర్ గావ్, భాజపా ఎంపీ
తాజా కథనాలపై కురంగ్ కుమే జిల్లా డిప్యూటీ కమిషనర్ నీఘే బెంగియా స్పందించారు. సోషల్ మీడియాలో వస్తgన్న వార్తలపై నిజానిజాలు తెలుసుకునేందుకు ఘటనా స్థలానికి సీనియర్ అధికారులను పంపినట్లు తెలిపారు. కూలీల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టామన్నారు. దట్టమైన అడవి, కొండల ప్రాంతం కావడంతో గాలింపు చర్యలు ఆలస్యమవుతున్నట్లు తెలిపారు. దమిన్ ప్రాంతం వాస్తవాధీన రేఖకు సమీపంలోనే ఉంటుంది.
ఇవీ చదవండి: యూనివర్సిటీకి డ్రగ్స్ సరఫరా.. మోడల్ అరెస్ట్
అరెస్టులపై స్టే విధించాలంటూ మరోసారి సుప్రీం మెట్లెక్కిన నుపుర్ శర్మ