One Crore To Bank Account Every Day : గుర్తుతెలియని బ్యాంకు ఖాతా నుంచి ఓ వ్యక్తి అకౌంట్లోకి రోజూ రూ.కోటి జమ అయ్యాయి. ఇలా ఆరు రోజుల పాటు రోజూ రూ.కోటి చొప్పున ఖాతాలోకి వచ్చి చేరాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే..
అలీగఢ్ జిల్లా భుజ్‌పురా ప్రాంతానికి చెందిన అస్లాం 2010 నుంచి ఓ మెడికల్ స్టోర్‌ను నిర్వహిస్తున్నాడు. ఇతడి పేరుపై ఐడీఎఫ్‌సీ(IDFC), యూకో(UCO) బ్యాంకుల్లో రెండు బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ఈ క్రమంలో తన ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాలోకి నవంబర్ 11 నుంచి నగదు జమ కావడం గమనించాడు అస్లాం. గత ఆరు రోజులుగా రోజుకు రూ.కోటి చొప్పున జమ అయ్యాయి. అలా ఇప్పటివరకు ఆరు రోజుల్లో రూ.6 కోట్లు డిపాజిట్ అయ్యాయి. ఇలా వచ్చిన మొత్తాన్ని అస్లాం తన రెండో బ్యాంక్ ఖాతా(యూకో)కు బదిలీ చేస్తూ వచ్చాడు.
ఈ విషయమై స్థానిక పోలీసులను ఆశ్రయించాడు అస్లాం. తక్షణమే తన ఖాతాలోకి ఎవరు డబ్బులు పంపుతున్నారో తెలుసుకోవాలని కోరాడు. దీంతో ప్రస్తుతానికి అతడి బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయించారు పోలీసులు. అయినా నగదు జమ అవుతోందని.. అందులో తన సొంత డబ్బు కూడా ఉందని ఆందోళన చెందుతున్నాడు అస్లాం. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం రోజూ బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగుతున్నా ఫలితం లేకపోవడం వల్ల శుక్రవారం నేరుగా ఎస్ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. కానీ, అక్కడ ఉన్నతాధికారులను కలవలేకపోయాడు అస్లాం.

"నా బ్యాంకు ఖాతాల్లో నా సొంత డబ్బు కూడా ఉంది. బ్యాంక్ యాప్ నుంచి స్టేట్మెంట్లను కూడా డౌన్లోడ్ చేసి చూశాను. కానీ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది, ఎవరు పంపుతున్నారనే వివరాలు అందులో లేవు. దీనికి త్వరగా పరిష్కారం చూపాలని ఎస్పీ గారిని కోరాను."
-అస్లాం, మెడికల్ షాప్ యజమాని
విచారణకు ఆదేశం..
చివరకు, ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు జిల్లా ఎస్పీ. అయితే, అస్లాం ఖాతాలోకి రూ.4.78 కోట్లు వచ్చాయని వివరించారు. 'అస్లాం ఖాతాలోకి నిత్యం డబ్బు వస్తోంది. ఒక్కోసారి రూ.లక్ష, కొన్నిసార్లు రూ.2 లక్షలు, ఇంకొన్ని సార్లు రూ.25 వేలు, ఇలా నవంబర్ 13 వరకు అతడి బ్యాంక్ ఖాతాలోకి రూ.4 కోట్ల 78 లక్షల సొమ్ము వచ్చి చేరింది. ఆ తర్వాత కూడా నగదు జమ అవుతూనే ఉంది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు అస్లాం. వెంటనే అతడి ఖాతాలను స్తంభింపజేశాం. ఈ ఖాతాల్లో అతడి కష్టార్జితం కూడా ఉందని అతడు వాపోతున్నాడు. ఈ క్రమంలో విచారణకు ఆదేశించాం. త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి అతడికి ఉపశమనం కల్పిస్తాం' అని ఎస్పీ తెలిపారు.