Old Man Going To School In Mizoram : మిజోరంలోని చంఫాయీ జిల్లాలో ఓ 78 ఏళ్ల వృద్ధుడు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా చిన్నప్పుడే చదువు ఆపేసిన వ్యక్తి.. ఇంగ్లీషు నేర్చుకోవాలని మళ్లీ పాఠశాలకు వెళ్తున్నాడు. బడికి వెళ్లేందుకు పిల్లలతో పాటు యూనిఫాం వేసుకుని రోజూ 3 కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాడు. అన్నీ ఉన్నా.. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్న ఈ తరం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ఈ వృద్ధుడి గురించి తెలుసుకుందాం.
మిజోరంలోని చంఫాయీ జిల్లా హ్రుయికాన్ గ్రామానికి చెందిన లాల్రింగ్‌తర అనే 78 ఏళ్ల వృద్ధుడు 1945లో జన్మించాడు. లాల్రింగ్‌తర చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. దీంతో కుటుంబభారమంతా అతడి తల్లి మీద పడింది. ఒక్కడే సంతానం కావడం వల్ల ఇంట్లో కష్టాలు చూడలేక.. తన తల్లికి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఆ కారణంగా అతడి చదువు మధ్యలోనే ఆగిపోయింది. అయితే చదువు ఆపేసే సమయానికి మాతృభాషలో చదవడం, రాయడం నేర్చుకున్నాడు. దీంతో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నాడు.
అయితే ఇంగ్లీషు నేర్చుకోవానే కోరిక అతడిలో బలంగా ఉండిపోయింది. అలా ఇంగ్లీషు నేర్చుకోవాలనే ఆసక్తితో పాఠశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నాడు. అప్పటినుంచి అందరి పిల్లలలాగే యూనిఫాం ధరించి బ్యాగ్ వేసుకుని పిల్లలతో పాటు ప్రతిరోజు 3 కిలో మీటర్లు నడిచి బడికి వెళ్తున్నాడు. ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు.
అయితే, తాను ఇలా ఇంగ్లీషు నేర్చుకోవాలని ఎందుకు అనుకుంటున్నాడో లాల్రింగ్‌తర వివరించాడు. ఇంగ్లీషు అప్లికేషన్లు రాయడం, టీవీలో ఆంగ్ల వార్తలను అర్థం చేసుకోవడమే తన ప్రధాన లక్ష్యం అని తెలిపాడు. దీనిపై ప్రస్తుతం లాల్రింగ్ చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్పందించారు. లాల్రింగ్ ఇతర విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిగా నిలిచాడు. ఈ వయసులో కూడా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన ఆయన నిజంగా అందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు.