కరోనా వ్యాక్సిన్ అతిత్వరలోనే అందుబాటులోకి రానున్న నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులను కూడా కొవిడ్ యోధులుగా గుర్తించాలని డిమాండ్ చేశాయి బ్యాంకు సంఘాలు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశాయి. టీకా ఇవ్వడంలో కరోనా వారియర్స్‌కు మొదటి ప్రాధాన్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సందర్భంగా.. బ్యాంకర్లు కేంద్రం ముందు ఈ ప్రతిపాదనను ఉంచాయి.
జనవరిలో భారత్ బయోటెక్, కొవాగ్జిన్ టీకాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వీటిని మహమ్మారిపై ముందుండి పోరాడిన ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులకు అందించాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. ఈ క్రమంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్, ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్, నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంకర్స్ సంఘాలు సంయుక్తంగా ఆర్థిక మంత్రికి లేఖ రాశాయి.
"దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి బ్యాంకర్లుగా గొప్ప సేవలు అందించాం. లాక్డౌన్ ప్రకటించినా.. అత్యవసర సమయాల్లో ప్రజలకు సేవలను కొనసాగించాం. ప్రమాదాలు, అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆర్థిక వ్యవస్థకు చక్రాలుగా ఉన్నాం. వేలాది మంది బ్యాంకర్లు కరోనా బారిన పడినప్పటికీ నిరంతరాయంగా సేవలను అందించాం. కావున మమ్మల్ని కూడా కరోనా వారియర్స్‌గా గుర్తించాలి. వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇవ్వాలి."
- బ్యాంక్ సంఘాలు
ఇదీ చూడండి: 'శాస్త్రవేత్తల అనుమతి లభించిన వెంటనే వ్యాక్సినేషన్'