Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం మాటలకందని మహా విషాదం. ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ ఘటన.. ఓ నవ వధువును సైతం ఒంటరిదాన్ని చేసింది. బతుకుదెరువు కోసం చెన్నై వెళ్తున్న తన భర్త ప్రాణాలను బలితీసుకుంది. పెళ్లై నెల రోజులు కూడా కానీ.. వారి దాంపత్య జీవితాన్ని శాశ్వతంగా విడగొట్టింది. బిహార్‌కు చెందిన రూప అనే మహిళ.. శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో తన భర్త అఖిలేశ్ కుమార్ యాదవ్‌ను కోల్పోయింది.
22 ఏళ్ల అఖిలేశ్ కుమార్ యాదవ్.. బహదూర్‌పుర్ బ్లాక్‌లోని మనియారి గ్రామానికి చెందిన వ్యక్తి. చెన్నైలో జ్యూస్ అమ్ముతూ జీవనం సాగించేవాడు. 2023 మే 7నే.. రూప అనే యువతితో అఖిలేశ్ వివాహం జరిగింది. అనంతరం బతుకుదెరువు కోసం చెన్నై వెళుతూ.. ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన అనంతరం.. జేబులో ఉన్న ఆధార్ కార్డ్ ద్వారా అఖిలేశ్‌ను గుర్తించారు అధికారులు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఒడిశాకు వచ్చి మృతదేహాన్ని తీసుకువెళ్లాల్సిందిగా వారికి సూచించారు. దీంతో ఒక్కసారిగా అఖిలేశ్ మరణ వార్త విన్న అతని కుటుంబసభ్యులు.. తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చాలా కాలంగా.. చెన్నైలో ఓ జ్యూస్ షాప్ నడిపిస్తూ కాలం వెళ్లదిస్తున్నాడు అఖిలేశ్ కుమార్ యాదవ్. పెళ్లి అనంతరం జులై ఒకటినే తన స్నేహితుడు బౌవేసాహెబ్ సాహ్నితో కలిసి.. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై బయలుదేరాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

కాగా భర్త మరణంపై అతని భార్య రూప.. కన్నీరు మున్నీరై విలపిస్తోంది. పెళ్లైన కొద్ది రోజులకే తన భర్త ప్రాణాలు కోల్పవడం వల్ల గుండెలు పగిలేలా రోదిస్తోంది. ప్రస్తుతానికి అఖిలేశ్ మృతదేహాం ఇంకా ఇంటికి చేరలేదు. అతడి శవాన్ని ఇంటికి తీసుకువచ్చేందుకు.. ఒడిశాకు బయలుదేరారు కుటుంబ సభ్యులు.


ఒడిశా రైలు ప్రమాదం..
శుక్రవారం రాత్రి బహానగా రైల్వే స్టేషన్లో లూప్ లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బలంగా ఢీకొట్టింది. దీంతో రైలు బోగీలు పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయాయి. పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు పక్క ట్రాక్‌పై పడ్డాయి. దీంతో అటువైపుగా వస్తున్న బెంగళూరు-హవ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చివరి బోగీలను ఢీకొట్టింది. ఘటనలో మొత్తం 278 మంది మృతి చెందారు. మరో వెయ్యి మందికిపైగా గాయపడ్డారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థలో మార్పు వల్లే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అధికారులు అంచనాకు వచ్చారు. ఈ రైలు ప్రమాద ఘటన వందల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.