Odisha Road Accident : ఒడిశా కెందుఝార్ జిల్లా సటిపూర్‌లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లిబృందంపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన 20వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు జరిగింది.
ఇదీ జరిగింది
శాతిగఢ్కు చెందిన సహీర్ కార్తిక్ పంగే కూతురు వివాహం.. మన్పుర్కు చెందిన హరిబంధు కుమారుడు హేమంత్‌తో జరగాల్సి ఉంది. ఇందుకోసం వధువు ఇంటికి వెళ్లేందుకు మంగళవారం రాత్రి డ్యాన్స్ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరారు హేమంత్ కుటుంబ సభ్యులు, బంధువులు. ఇంకా కొద్ది సేపటిలో వధువు ఇంటికి చేరుకుంటామన్న సమయంలో ఓ ట్రక్కు వారిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం పరీక్షల కోసం పంపించారు. మృతుల్లో పెళ్లి కుమారుడి ఇంట్లో పనిచేసే ముగ్గురు ఉన్నారు. మిగతా వారు పెళ్లి కుమారుడి బంధువులు. దీంతో వరుడు పెళ్లి చేసుకోకుండానే తిరిగి వచ్చేశాడు. మరోవైపు ఘటనా స్థలి వద్ద గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. ఇక్కడి తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని.. ప్రభుత్వం ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రెండు బస్సులు ఢీ.. 12 మంది మృతి
Odisha Accident Today : అంతకుముందు రెండు రోజుల కిందటే ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలోని దిగపహండి సమీపంలో పెళ్లి బస్సు, ఒడిశా ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొన్నాయి. సోమవారం వేకువజామును ఒంటి గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద తీవ్రత ధాటికి రెండు బస్సులు.. పూర్తిగా నుజ్జునుజ్జుయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు కూడా అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని బ్రహ్మపురలోని MKCG ఆస్పత్రికి తరలించారు. రెండు బస్సుల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ట్రక్కు-రిక్షా ఢీ..
ఇటీవల మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. దాపోలి-హర్నే రహదారిపై ట్రక్కు, రిక్షా పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా.. కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే.. విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు.. సీఎం సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.