ఒడిశా రైలు ప్రమాద ఘటనకు కారణాలపై నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. తప్పుడు కథనాలు, పుకార్లను నమ్మవద్దని పేర్కొన్నారు. మూడు రైళ్ల ప్రమాదానికి కారణాలు తెలియాలంటే సీబీఐ ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యేవరకు ఆగాలని మంత్రి చెప్పారు. 'ఇది చాలా సున్నితమైన అంశం. అసలు నిజమేంటో మనకు తెలియాలి. సాంకేతికంగా మూల కారణమేంటో తెలుసుకోవాలి. సీబీఐ ప్రాథమిక దర్యాప్తు పూర్తి కానివ్వండి. ఆ తర్వాత భవిష్యత్‌లో తీసుకునే చర్యలపై నిర్ణయం తీసుకుంటాం' అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం ఒడిశాలోని బాలేశ్వర్‌లో జూన్ 2న జరిగింది. మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఈ ఘటనలో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన రైళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇంటర్‌లాక్ వ్యవస్థలో మార్పులు జరగడం వల్లే ప్రమాదం సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మార్పుల వెనుక కుట్ర కోణం ఏదైనా ఉందా అని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు బృందం(సీబీఐ).. సంబంధిత రైల్వే ఉద్యోగులను ప్రశ్నిస్తోంది.
అమీర్ ఖాన్‌పై సీబీ'ఐ'
కాగా సీబీఐ దర్యాప్తులో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా బాలేశ్వర్ సిగ్నల్ జేఈ అమీర్‌ఖాన్ అద్దె ఇంటికి గత సోమవారం సీబీఐ అధికారులు సీల్ వేశారు. మంగళవారం అమీర్‌ఖాన్ సమక్షంలోనే అతడి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అంతకుముందు అమీర్ ఖాన్‌ను రహస్య ప్రాంతానికి తరలించి సుదీర్ఘంగా విచారించారు. ఈ ప్రమాదంపై జూన్ 6న సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అప్పటి నుంచి జరుగుతున్న దర్యాప్తు.. జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీల్ వేసిన నేపథ్యంలో కీలక మలుపు తిరిగింది.
రైలు ప్రమాద ఘటన తర్వాతి నుంచే జేఈ అమీర్ ఖాన్ కదలికలపై అధికారులు నిఘా ఉంచినట్లు సమాచారం. విచారణ చేపట్టిన తొలినాళ్లలోనే సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్ ఇంటికి సీల్ వేసిన తర్వాత సీబీఐ అధికారుల బృందం.. సోరోలోని తెంటెయ్ ఛక్‌లో ఉన్న బాహానగా స్టేషన్ మాస్టర్ ఇంటిని సైతం పరిశీలించింది. జూన్ 16న బాలేశ్వర్‌లో పలువురిని విచారించిన సీబీఐ అధికారులు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
ఆ పనే కీలకం...
పాయింట్ మెషీన్లు, ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లు, సిగ్నల్‌లతో సహా సిగ్నలింగ్ పరికరాల ఇన్‌స్టాలేషన్, నిర్వహణ, మరమ్మతు విధులను జూనియర్ సిగ్నల్ ఇంజినీర్ నిర్వహిస్తారు. రైలు సేవలను సాఫీగా, సురక్షితంగా నిర్వహించడంలో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతటి కీలకమైన విధుల్లో ఉన్న జేఈ అమీర్ ఖాన్ ఇంటిని సీబీఐ అధికారులు సీల్ చేయడం ఆసక్తి రేపుతోంది.