ఒడిశా ఛాందిపుర్లోని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ మాజీ ఫొటోగ్రాఫర్ ఈశ్వర్ బెహెరాకు జీవితఖైదు విధించింది బాలాసోర్ అదనపు జిల్లా కోర్టు. పాకిస్థాన్ నిఘా సంస్థ కోసం పనిచేశాడన్న నేపథ్యంలో ఈ శిక్ష విధించినట్లు పేర్కొంది.
ఇదీ జరిగింది....
డీఆర్డీఓ సంస్థలో కాంట్రాక్టు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న సమయంలో... భారత్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని, డాక్యుమెంట్లను పాకిస్థాన్ నిఘా సంస్థతో పంచుకున్నాడు బెహరా. ఈ నేపథ్యంలో ఒడిశా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డిసెంబర్ 22, 2014లో బెహెరాను అరెస్టు చేశారు.
మయూర్బంజ్ జిల్లా సమీపంలోని కాంతిపుర్ ప్రాంతానికి చెందిన ఈశ్వర్ బెహెరా... డీఆర్డీఓలో పనిచేస్తున్న సమయంలో మీరట్‌కు చెందిన ఓ వ్యక్తితో తరచూ మాట్లాడి, కీలక సమాచారాన్ని అందించాడు. బెహెరా మొబైల్ ట్యాప్ చేసి ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు... ఐపీసీ సెక్షన్ కింద దేశద్రోహం, నేరపూరిత కుట్ర మొదలైన కేసులు నమోదు చేశారు. అప్పటినుంచి జుడిషియల్ కస్టడీలో ఉన్న బెహెరా... పలుమార్లు బెయిల్ కోరినా కోర్టు అందుకు తిరస్కరించింది. తాజాగా జీవిత ఖైదు విధించింది.