ఒడిశా ఆరోగ్యశాఖ మంత్రి నవ కిశోర్‌దాస్‌పై కాల్పులు జరిపాడు ఓ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. ఈ ఘటనలో కిశోర్ దాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఛాతీలోకి బుల్లెట్లు దూసుకెళ్లడం వల్ల ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఝార్సిగూడ జిల్లాలోని బ్రెజరాజనగర్ గాంధీచౌక్‌లో జరిగిందీ ఘటన. ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా మంత్రిపై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. నిందితుడు ఏఎస్ఐ గోపాల్‌దాస్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు.. మంత్రిపై కాల్పులు జరపడానికి కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మంత్రిని మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్‌కు వాయుమార్గంలో తరలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
మంత్రిపై చాలా దగ్గరి నుంచి పోలీసు అధికారి కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 'ప్రజా ఫిర్యాదుల కార్యాలయం ప్రారంభోత్సవానికి దాస్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఒక్కసారిగా గన్ శబ్దం వినిపించింది. ఓ పోలీసు చాలా దగ్గరి నుంచి మంత్రిపై కాల్పులు జరిపి పారిపోవడం మేం చూశాం' అని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. 'బుల్లెట్ ఛాతిలోకి దూసుకెళ్లగానే.. మంత్రి స్పృహ కోల్పోయి పడిపోయారు. ఆయనకు తీవ్ర రక్తస్రావమైంది. చుట్టూ ఉన్నవారు మంత్రిని పైకి లేపి ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సహాయం చేశారు. తొలుత ఝార్సుగూడ జిల్లా ఆస్పత్రికి ఆయన్ను తీసుకెళ్లారు. ప్రస్తుతం నిందితుడిని ప్రశ్నిస్తున్నాం. పూర్తి విచారణ తర్వాతే మరిన్ని వివరాలు తెలుస్తాయ'ని బ్రజ్రనగర్ ఎస్డీపీఓ గుప్తేశ్వర్ భోయ్ తెలిపారు.
సీఎం విచారం
ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. నవ దాస్ వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని క్రైమ్ బ్రాంచ్‌ను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. క్రైమ్ బ్రాంచ్ సీనియర్ అధికారులు వెంటనే ఘటనాస్థలిని సందర్శించాలని ఆదేశించారు.
మరోవైపు, భద్రతా వైఫల్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని దాస్ మద్దతుదారులు స్థానికంగా ఆందోళనకు దిగారు. కావాలనే ఆయన హత్యకు ఎవరో కుట్ర పన్నారని మరికొందరు ఆరోపించారు.