NTR Centenary Celebrations In Hyderabad : తెలుగు జాతి కీర్తిని ఉన్నత స్థితిలో నిలబెట్టిన మహనీయుడు, ఆంధ్రజాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు. తెలుగు వారి గొంతును దిల్లీ పీఠం వరకు వినిపించేలా.. పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలలోనే అధికారంలో నిలిపి తనదైన ముద్రను వేసిన విలువలు ఉన్న రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్. నేడు ఆ యుగపురుషుని శతజయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన తనయుడు, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ, మనవడు జూ. ఎన్టీఆర్, నందమూరి కుటుంబ సభ్యులు పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ నాయకులు, అభిమానులు అందాల రామునికి ఘన నివాళులు అర్పించారు.
Balakrishna and Jr NTR paid tribute to Sr.NTR : ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జయంతిని రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ సినిమాలోనే కాదు.. రాజకీయ రంగంలోనూ అగ్రగామిగా వెలుగొందారని పేర్కొన్నారు. రాజకీయాల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వివరించారు. నాడు ఎన్టీఆర్ పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం నేడు ఆహార భద్రతగా మారిందన్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించారని.. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఎన్టీఆర్ కుమారుడిగా జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నానని బాలకృష్ణ అన్నారు.
"ఎన్టీఆర్ అంటే ఒక శక్తి. ఎన్టీఆర్ అంటే తెలుగువారి ఆత్మగౌరవం. సినిమాల్లో అనేక పాత్రలు పోషించారని.. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల కోసం సర్కారియా కమిషన్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు."- నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుమారుడు
NTR Birthday : కారణజన్ముడు.. తారకరాముడు.. ఆయనకు మాత్రమే సాధ్యమైన ఘనతిది!
ఎన్టీఆర్ పుస్తకం ఆవిష్కరణ : ఎన్టీఆర్‌లోని క్రమశిక్షణ, కృషి, అంకితభవం, లక్ష్యసాధన.. నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రముఖ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి రాసిన 'ఎ పోలిటికల్ బయోగ్రఫీ ఎన్టీఆర్, ఎన్టీఆర్ రాజకీయ జీవిత చిత్రం అసలు కథ' ఇంగ్లీష్, తెలుగు పుస్తకావిష్కరణ కార్యక్రమం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ న్యాయమూర్తులు జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, జస్టిస్ చలమేశ్వర్, పౌరుహక్కుల నేత హరగోపాల్, పుస్తక రచయిత కె. రామచంద్రమూర్తి పుస్తకాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి :