Jayalalitha Death: తమిళనాడు మాజీ సీఎం, దివంగత నేత జయలలిత మృతిపై విచారణకు అన్నాడీఎంకే నేత పన్నీర్‌సెల్వం రెండు రోజు కూడా హాజరయ్యారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు చెన్నైలో జస్టిస్ అరుముఘస్వామి ప్యానెల్ ఎదుట హాజరైన పన్నీర్‌సెల్వం.. జయలలిత మృతికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మరణంపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు.
"జయలలిత మృతిపై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి అనుమానాలు లేవు. కేవలం ప్రజల్లోనే ఆ అనుమానం ఉంది. అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో.. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని శశికళ పలుమార్లు చెప్పారు. ఈ విషయాన్ని నేను కేవలం కొందరు మంత్రులకు తప్ప బహిరంగంగా వెల్లడించలేదు. ఆస్పత్రిలో ఆమెకు ఏ రకమైన ఆహారం అందించారో నాకు తెలియదు. వ్యక్తిగతంగా నాకు శశికళ అంటే ఇంకా గౌరవం ఉంది."
-పన్నీర్‌సెల్వం, తమిళనాడు మాజీ సీఎం
సోమవారం జరిగిన విచారణలో భాగంగా పన్నీర్‌సెల్వంతో పాటు జయలలిత బంధువు ఇళవరసి కూడా జ్యుడీషియల్ కమిషన్ ఎదుట హాజరయ్యారు. 'జయలలిత ఆరోగ్య పరిస్థితిపై నాకు ఏమీ తెలియదు. ఆమె ఆస్పత్రిలో చేరారని తెలిసిన తర్వాత ఒకట్రెండు సార్లు మాత్రమే ఆమెను గది అద్దంలో నుంచి చూశాను. జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు శశికళ ఒక్కరే ఆమె బాగోగులు చూసుకున్నారు' అని ఇళవరిసి కమిషన్‌తో చెప్పారు.
జయలలిత మృతిపై జస్టిస్ అరుముఘస్వామి కమిషన్ దర్యాప్తు చేస్తోంది. జనవరి 24తో ఈ కమిషన్ గడువు ముగిసినప్పటికీ డీఎంకే ప్రభుత్వం దాన్ని జూన్ 24వరకు పొడిగించింది. 2017 అన్నాడీఎంకే హయాంలోనే ఈ కమిషన్ ఏర్పాటైంది.
ఇదీ చూడండి : క్షీణించిన లాలూ ఆరోగ్యం.. రాంచీ నుంచి దిల్లీకి తరలింపు!