కరోనా తీసుకునే అభ్యర్థులకు.. దుష్ప్రభావాలు, వైద్య ప్రతికూలతల నుంచి రక్షణ కోసం ఎలాంటి బీమా సౌకర్యం కల్పించడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. టీకా స్వీకరించడం అభ్యర్థి ఐచ్ఛికమేనని రాజ్యసభకు తెలిపింది.
వ్యాక్సినేషన్ సందర్భంగా తలెత్తే దుష్ప్రభావాలకు బీమా అందిస్తున్నారా అని ఎగువ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే తీవ్ర అలర్జీలకు సంబంధించిన(అనాఫిలాక్సిస్) కిట్లను టీకా కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యర్థిని అరగంట పాటు పరిశీలనలో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. టీకా తీసుకున్న తర్వాత తలెత్తే దుష్ప్రభావా(ఏఈఎఫ్ఐ)లకు ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
స్వల్పంగానే దుష్ప్రభావాలు
ఫిబ్రవరి 4నాటికి కొవాగ్జిన్ టీకా తీసుకున్న 81 మంది ప్రతికూల ప్రభావానికి గురయ్యారని చౌబే తెలిపారు. ఇది మొత్తం అభ్యర్థుల్లో 0.096 శాతమేనని వెల్లడించారు. మరోవైపు, కొవిషీల్డ్ టీకా అభ్యర్థుల్లో 8,402 మంది ప్రతికూల ప్రభావానికి గురయ్యారని, ఇది మొత్తం టీకా అభ్యర్థుల్లో 0.192 శాతమని వివరించారు. వీరిలో ఎక్కువగా జ్వరం, తలనొప్పి, ఆందోళన, మైకం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించాయని చెప్పారు. వీరంతా బాగానే కోలుకున్నారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: టీకా పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు