Nitish Kumar Vice President: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తదుపరి ఉపరాష్ట్రపతి కానున్నారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీకాలం కొద్ది నెలల్లో ముగుస్తున్న నేపథ్యంలో.. నితీశ్ ఆ స్థానంలో బాధ్యతలు చేపట్టవచ్చంటూ కొన్ని మీడియాల్లో వార్తలు వస్తుండటం వల్ల ఇది చర్చనీయాంశమైంది. ఇదే జరిగితే బిహార్ నుంచి నాలుగు సభలకు(బిహార్ శాసనసభ, బిహార్ శాసనమండలి, లోక్సభ, రాజ్యసభ) ప్రాతినిధ్యం వహించిన నాలుగో రాజకీయ నేతగా నితీశ్ నిలుస్తారు. అంతకుముందు.. లాలూ ప్రసాద్ యాదవ్, సుశీల్ మోదీ, నాగమణి కుశ్వాహా ఈ ఘనత సాధించారు.
ఆయన వెళ్లాల్సిందే: నితీశ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశంపై బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి స్పందించారు. నితీశ్ రాజ్యసభకు వెళ్లాలని.. అదే అందరూ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇటీవల జర్నలిస్టులతో జరిగిన అనధికారిక భేటీలో నితీశ్ రాజ్యసభ విషయాన్ని ప్రస్తావించినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. "రాజ్యసభకు వెళ్లేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రస్తుతం నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇది గత పదహారేళ్లలో అనేక సార్లు చేపట్టాను." అని నితీశ్ పేర్కొన్నట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
అందులో నిజం లేదు: నితీశ్ కుమార్ త్వరలో రాజ్యసభకు వెళ్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు బిహార్ కేబినెట్ మంత్రి, జేడీయూ నేత సంజయ్ కుమార్ ఝా. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారని.. పదవీ కాలం ముగిసే వరకు సీఎంగా కొనసాగుతారని స్పష్టం చేశారు. 2020 బిహార్ ఎన్నికల్లో నితీశ్ కారణంగానే ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. ప్రజా సేవ, బిహార్ రాష్ట్ర అభివృద్ధికి నితీశ్ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్న వారికి కలిగే లాభం ఏమీ ఉండదని తెలిపారు.
ఇదీ చూడండి : వీడ్కోలు వేదికపై పాటలతో అలరించిన రాజ్యసభ ఎంపీలు