అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి సచిన్ వాజే నడిపే కారును స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ బృందం. కారు నంబర్ ప్లేటు, రూ. 5లక్షలకు పైగా నగదు, నోట్లను లెక్కించే యంత్రం, కొన్ని వస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) ఐజీ అనిల్ శుక్లా తెలిపారు. ఈ కారును సచిన్ వాజే నడిపేవారని.. కానీ దాని యజమాని ఎవరో తెలియాల్సి ఉందన్నారు.
సచిన్ వాజేకు చెందిన క్రైం బ్రాంచ్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించింది జాతీయ దర్యాప్తు బృందం. నేరారోపణలను ధ్రువీకరించే పలు పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి 8 నుంచి మంగళవారం ఉదయం 4 గంటల వరకు తనిఖీలు కొనసాగించినట్లు చెప్పారు. క్రైం బ్రాంచ్ కార్యాలయంలో విధులు నిర్వర్తించే మరో పోలీస్ అధికారిని సైతం విచారించింది ఎన్ఐఏ బృందం.
ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అధికారి సచిన్ వాజేను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం మార్చి 25 వరకు వాజేకు రిమాండ్ విధించింది.
ఇదీ చదవండి : 'అంబానీ ఇంటి వద్ద బాంబు'పై ఎన్ఐఏ దర్యాప్తు