అంబానీ ఇంటి వద్ద బాంబు కేసులో పోలీస్ అధికారి సచిన్ వాజేను జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) శనివారం రాత్రి అరెస్టు చేసింది. ఈ విషయాన్ని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. 12 గంటల పాటు విచారణ జరిపిన తర్వాత వాజేను అరెస్టు చేశామని స్పష్టం చేశారు. వాంగ్మూలం ఇచ్చేందుకు ముంబయిలోని ఎన్ఐఏ కార్యాలయానికి వచ్చిన వాజేను ఉదయం 11.30 నుంచి సుదీర్ఘ కాలం పాటు ఎన్ఐఏ విచారించింది. ఈ సందర్భంగా ముంబయి పోలీసుల వాంగ్మూలాన్ని కూడా ఎన్ఐఏ నమోదు చేసింది.
గత నెల 25న ముకేశ్ అంబానీ ఇంటివద్ద జిలెటిన్ ఉన్న స్కార్పియో కారును పోలీసులు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు ఎన్ఐఏ చేపడుతుండగా, ఆ కారు యజమానిగా పేర్కొన్న మాన్సుఖ్ హిరేన్ కేసును వాజే ఆధ్వర్యంలో ముంబయి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే వాజేపై ఆరోపణలు రావడం వల్ల ఆయనను క్రైం బ్రాంచ్ నుంచి బదిలీ చేశారు.
ఇదీ చదవండి : సచిన్ వాజే వాట్సాప్ స్టేటస్ కలకలం