Women Have More Sex Partners: దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పురుషులు, మహిళల లైంగిక జీవనానికి సంబంధించి కీలక విషయాలు వెలువడ్డాయి. 2019-21 కాలానికి గాను 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్వే నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-ఎన్ఎఫ్హెచ్ఎస్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పలు రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళలే అధిక మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వేలో తేలింది. రాజస్థాన్, హరియాణా, చండీగఢ్, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, అసోం, లక్షద్వీప్, పుదుచ్చెరి, తమిళనాడు రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళలు తమ జీవిత కాలంలో అధికమంది సెక్స్ పార్టనర్లను కలిగి ఉన్నారు. రాజస్థాన్‌లో సగటున ఒక మహిళ 3.1 మందితో లైంగిక సంబంధం కలిగి ఉండగా.. పురుషుడు 1.8 మందితో ఉన్నట్లు ఆ సర్వే వెల్లడించింది. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే పురుషులు, మహిళల లైంగిక భాగస్వామ్యుల సగటు అధికంగా ఉంది.
దేశవ్యాప్తంగా 707 జిల్లాలలోని 1.1 లక్షల మంది మహిళలు, లక్ష మంది పురుషులపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే చేయగా.. మహిళల కంటే పురుషులే అధికమంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నారు. సర్వేకు ముందు 12నెలల కాలంలో జీవిత భాగస్వామి లేదా సహజీవనం చేస్తున్న వ్యక్తితో కాకుండా ఇతర వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్న పురుషులు 4శాతంగా ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది. అదే మహిళలలో అయితే ఇది 0.5 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సగటున ఒక పురుషుడు 1.7 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉండగా, మహిళ 1.5 మందితో శారీరక బంధాన్ని కొనసాగిస్తోంది.
గతేడాది దేశవ్యాప్తంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్న స్త్రీల సంఖ్య 0.3 శాతం కాగా, మహిళ జీవిత కాలంలో సెక్స్ పార్టనర్ల సంఖ్య 1.7గా ఉంది. అదే విధంగా గతేడాది ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో సంబంధం కలిగి ఉన్న పురుషులు 1.2 శాతం కాగా, జీవిత కాలంలో 2.1 మందితో లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది ఇద్దరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాన్ని కలిగిన మహిళలు 0.1 శాతంగా, పురుషులు 1.2 శాతంగా ఉన్నారు. తెలంగాణలో గతేడాది 0.4 శాతం మంది మహిళలు ఇద్దరు కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇది పురుషుల్లో 2.1శాతంగా ఉంది.
ఇవీ చూడండి: మమతతో సుబ్రహ్మణ్య స్వామి భేటీ, ధైర్యవంతురాలంటూ ప్రశంసలు, మోదీపై ఫైర్
ఆ నిర్దోషులంతా పరిహారం కోరితే ఎలా, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు