Newsclick Journalists Arrested : న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ సహా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు దిల్లీ పోలీసులు. మనీ లాండరింగ్‌తోపాటు చైనాకు అనుకూలంగా వార్తలు రాస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో ఉపా చట్టం కింద వీరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 37 మంది అనుమానితులను ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి అనేక పత్రాలు, డిజిటల్ సాధనాలను స్వాధీనం చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థకు చెందిన కార్యాలయంతో, జర్నలిస్టుల ఇళ్లు సహా 30 ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. న్యూస్‌క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్‌తో పాటు పలువురు జర్నలిస్టులను స్పెషల్ సెల్ పోలీసులు తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రబీర్ పుర్కాయస్థతో పాటు అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేయగా.. ఆయనకు ఈ కేసుతో ఉన్న సంబంధం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు దిల్లీ పోలీసులు.
మరోవైపు, ఈ దాడులను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. బిహార్ కులగణన ద్వారా బయటపడిన సంచలన విషయాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని మండిపడింది. దేశవ్యాప్తంగా కులగణనకు డిమాండ్ పెరుగుతోందని, దీన్ని కప్పిపుచ్చేందుకు దాడులు జరుపుతున్నారని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేడా పేర్కొన్నారు. దిల్లీ పోలీసు దాడులపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలతో ఓ ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలిపింది.
ఆరోపణలు ఇవీ..
ఆగస్టు 5న అమెరికాకు చెందిన న్యూ యార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికాకు చెందిన మిలియనీర్ నెవిల్ రాయ్ సింగం నుంచి గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్ నిధులు పొందినట్లు న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఆ తర్వాత ఈ ఏడాది ఆగస్టు 17న చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ)- ఉపా చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు దిల్లీ పోలీసులు.
Ram Setu Supreme Court : 'రామసేతు' వద్ద గోడ కట్టాలంటూ పిల్.. నో చెప్పిన సుప్రీం