Parliament New Building Opening : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సోమవారం సమావేశాల అనంతరం ఉభయ సభలూ మంగళవారానికి వాయిదా పడ్డాయి. మంగళవారం నుంచి పార్లమెంట్ కొత్త భవనంలో సమావేశాలు జరగనున్నాయి. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పంతో పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఓ కార్యక్రమానికి నాయకత్వం వహించనున్నారు. దాదాపు గంటన్నర పాటు జరిగే ఈ కార్యక్రమం జాతీయ గీతంతో మొదలై.. జాతీయ గీతంతోనే ముగియనుంది.
సెంట్రల్ హాల్‌లో జరిగే ప్రారంభ కార్యక్రమంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్వాగత ప్రసంగం చేస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ పార్లమెంటేరియన్లైన మేనకా గాంధీ, శిబు సోరెన్ కూడా మాట్లాడనున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగం కూడా ఉంటుందని తెలిసినప్పటికీ ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన హాజరు కాకపోవచ్చని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం కోసం ప్రధాని మోదీ.. రాజ్యాంగ ప్రతిని పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు తీసుకెళ్లే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్యక్రమం అనంతరం ఎంపీలకు భోజనం విరామం ఉంటుంది. ఆ తర్వాత నూతన పార్లమెంట్ భవనానికి సభ్యులను రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మార్గ నిర్దేశం చేయనున్నారు.
ఫొటో సెషన్..
సెంట్రల్ హాల్ ఫంక్షన్‌కు ముందు ఫొటో సెషన్ ఉండనుంది. అందులో భాగంగా పాత పార్లమెంటు భవనం లోపలి ప్రాంగణంలో మూడు వేర్వేరు గ్రూప్ ఫొటోలు తీసుకోనున్నారు. మొదటిది రాజ్యసభ, లోక్‌సభ సభ్యులది కలపి.. రెండు, మూడోది వేర్వేరుగా తీయనున్నారు. కార్యక్రమం కోసం రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు ఉదయం 11 గంటల వరకు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌కు చేరుకోవాలని రాజ్యసభ ఓ ప్రకటనలో తెలిపింది. సీనియర్ కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి స్వయంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించి అధికారులతో సంప్రదింపులు జరిపారు. సోమవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సెంట్రల్ హాల్‌ను సందర్శించారు.