దేశంలో కొత్త మిలిటెంట్ గ్రూప్ ఏర్పడింది. అసోం రాష్ట్ర విభజన కోరుతూ ఈ తీవ్రవాద సంస్థ ఆవిర్భవించింది. అసోం నుంచి కామ్తాపుర్ను విభజించి పత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ఈ మిలిటెంట్ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు సంస్థ స్థాపకులు చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన ఈ మిలిటెంట్ గ్రూప్ పేరు.. గ్రేటర్ కూచ్ బెహర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (జీసీఎల్ఓ). ప్రత్యేక కామ్తాపుర్ రాష్ట్రమే.. దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం అసోంలో ఉన్న ప్రాంతాన్ని విభజన చేసి కొత్త రాష్ట్రం ప్రకటించాలని ఈ జీసీఎల్ఓ కోరుతోంది. తమ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఆయుధాలు చేతబడతామని.. జీసీఎల్ఓ మిలిటెంట్ సంస్థ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
ఇప్పటికే అసోం నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో.. కామ్తాపుర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (కేఎల్ఓ) ఆవిర్భవించింది. 20 ఏళ్లుగా ప్రత్యేక రాష్ట్ర కోసం ఈ సంస్థ ఉద్యమం చేస్తూ వస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో కామ్తాపుర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (కేఎల్ఓ)కు, ప్రభుత్వానికి మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు సమాచారం. కేఎల్ఎమ్ కమాండర్ ఇన్ చీఫ్ జీబాన్ సింగ్‌తో ఈ చర్చలు జరిగాయి. ఆయుధాలు వదులుకొని జన స్రవంతిలోకి కలిసేందుకు ఆయన అంగీకరించినట్లు పలు కథనాలు వెలువడ్డాయి.
అయితే కొత్తగా ఏర్పడిన జీసీఎల్ఓ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ.. రాజ్‌దీప్ కోచ్, జీబాన్ సింగ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీనికి సంబంధించి ఒక వీడియో సైతం విడుదల చేశారు. ఓ గుర్తు తెలియని స్థావరం నుంచి ఈ వీడియోను పంపించారు. "కేఎల్ఎమ్ కమాండర్ ఇన్ చీఫ్.. జీబాన్ సింగ్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధమయ్యారు. జన స్రవంతిలోకి కలిసేందుకు జీబాన్ సింగ్ అంగీకరించారు. కానీ ఆయన వెంట వెళ్లేందుకు.. సంస్థ నాయకులు, సభ్యులు ఎవ్వరూ సిద్ధంగా లేరు. కేఎల్ఎమ్ తన ఉద్యమాన్ని విడిచిపెట్టినందుకే.. ఈ జీసీఎల్ఓ మిలిటెంట్ సంస్థను స్థాపించాం" అని రాజ్‌దీప్ కోచ్ తెలిపాడు. ఈ నేపథ్యంలోనే కొత్త మిలిటరీ గ్రూప్ ఈ ప్రాంతంలో అస్థిరతను సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మయన్మార్ నుంచి తొమ్మిది మంది నాయకులు, మరికొంత మంది సభ్యులు భారత్‌లోకి ప్రవేశించారని చెబుతున్నాయి.