మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యవాలి. శుక్రవారం జరగనున్న భారత్-నేపాల్ జాయింట్ కమిషన్ 6వ సమావేశం(జేసీఎం)లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్షతో పాటు కొవిడ్-19 సంబంధిత సహకారంపై ప్రధానంగా చర్చించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.
భారత్‌లోని లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను కలుపుతూ గతఏడాది నేపాల్ కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ వివాదం చెలరేగిన తరువాత నేపాల్ నుంచి ఓ సీనియర్ నేత భారత పర్యటనకు రావటం ఇదే తొలిసారి.
ఈ క్రమంలో.. శుక్రవారం జరగనున్న 6వ జేసీఎం భేటీలో భారత్-నేపాల్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు.. వాణిజ్యం, రవాణా, విద్యుత్తు, సరిహద్దు సమస్యలు, కొవిడ్-19 సహకారం, మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్, పెట్టుబడులు, వ్యవసాయం, పర్యటకం వంటి అంశాలపై చర్చించనున్నట్లు నేపాల్ పేర్కొంది.
రెండు వేరు వేరు..
మరోవైపు.. నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన నేపథ్యంలో చర్చలపై ఆ దేశం చేసిన ప్రకటనను తోసిపుచ్చారు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ. జాయింట్ కమిషన్ సమావేశం (జేసీఎం), సరిహద్దు చర్చలు వేరు వేరు అంశాలని స్పష్టం చేశారు.
ఉన్నతస్థాయి నేతలతో భేటీ..
మూడు రోజుల పర్యటనలో భాగంగా భారతలోని ఉన్నతస్థాయి ప్రముఖులతో భేటీ కానున్నారు నేపాల్ విదేశాంగ మంత్రి గ్యవాలి. ఈ పర్యటనలో ఆయనతో పాటు నేపాల్ విదేశాంగ కార్యదర్శి భరత్ రాజ్ పౌడ్యాల్, ఆరోగ్య శాఖ కార్యదర్శి లక్ష్మీ ఆర్యల్లు ఉన్నారు.
ఇదీ చూడండి: 'భారత్ నుంచి ఆ ప్రాంతాలను తిరిగి తీసుకుంటాం'